నేరాలు మెండుగా..  జైళ్లు నిండుగా

Every Year Number Of Prisoners Entering Jail Increasing Significantly - Sakshi

ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన జైళ్లే ఇప్పటికీ.. 

ఖైదీలు పెరుగుతున్నా పెరగని జైళ్ల సామర్థ్ధ్యం 

1,319 జైళ్లలో 2021 నాటికి 5,54,034 మంది ఖైదీలు.. వీరిలో విచారణ ఖైదీలే 4,27,165 మంది 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.

హత్యలు, దోపిడీలతో పాటు ఈ మధ్య కాలంలో సైబర్, ఆర్థిక నేరాలు, లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోంది. పర్యవసానంగా ఖైదీలతో జైళ్లు నిండిపోతున్నాయి. జైళ్ల సామర్ధాద్యనికి మించి ఖైదీలు కిక్కిరిసి పోతున్నారు. ఈ కారణంగా జైళ్లలో శుచి, శుభ్రత కరువవడంతో పాటు రక్షణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖైదీల మధ్య గొడవలు, దాడులు చేసుకుంటున్నాయి.  

పెరగని జైళ్ల సామర్థ్యం  
2016 నుంచి 2021 వరకు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన జైళ్లు అప్పటి జనాబా దామాషాకు సరిపోయేలా ఏర్పడినివి. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగి, నేరాలు పెరుగుతున్నా జైళ్ల సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. అవే జైళ్లలో ఖైదీలను కుక్కుతున్నారు.  

73 శాతానికి పైగా విచారణ ఖైదీలే.. 
దేశంలోని జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 73 శాతం వరకు విచారణలో ఉన్న ఖైదీలే ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. వివిధ రకాల నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తీర్పులు వెలువడక, ఇతరత్రా కారణాలతో జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్‌ పొందడానికి న్యాయ సహకారం అందనివారు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న 1,319 జైళ్లలో 2021 నాటికి 5,54,034 మంది ఖైదీలు ఉండగా.. వీరిలో విచారణ ఖైదీలే 4,27,165 మంది ఉండటం గమనార్హం. అంటే వీరంతా నేరారోపణలకు గురై, ఇంకా శిక్షపడకుండా, న్యాయస్థానాల్లో కేసులు వివిధ స్థాయిల్లో విచారణలో ఉన్నవారన్నమాట. వీరందరికీ శిక్ష పడుతుందా? లేదా? అన్నది న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంటుంది.   

యూపీలో అత్యధికం.. 
జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంటే.. అత్యల్పంగా లక్షద్వీప్‌లో ఉన్నారు. శిక్ష పడిన ఖైదీలతో పాటు విచారణ ఖైదీలు, ముందస్తుగా అదుపులోకి తీసుకునే నేరస్తుల జాబితాలోనూ సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 63,571 ఖైదీలకు సరిపోయే విధంగా జైళ్లు ఉంటే.. ప్రస్తుతం ఆ జైళ్లలో ఏకంగా 1,17,789 మంది ఖైదీలు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరాఖండ్‌లో వంద మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైలులో 185 మంది వరకు ఉంటున్నారు. దాని తర్వాత స్థానాల్లో బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో 56.1 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల జైళ్ల సామర్థ్యం కంటే ఖైదీలు పది శాతం తక్కువగా ఉండడం గమనార్హం జైళ్ల శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బడ్జెట్‌లో హర్యానా వంద శాతం ఖర్చు చేస్తూ మొదటి స్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ 96.8 శాతంతో రెండో స్థానంలో ఉంది.  

జైళ్లలో చికిత్స కష్టమే.. 
జైళ్లలో కిక్కిరిస్తున్న ఖైదీల కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయి.  జైళ్లలో ఏళ్లకేళ్లు ఉంటున్న వారికి అస్వస్థత ఏర్పడితే.. తక్షణమే వారికి వైద్య సదుపాయం కల్పించడానికి అనువైన సౌకర్యాలు లేవు. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది లేక వారికి చికిత్స అందించడం ఆలస్యం అవుతోంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలు ఉండే సామర్థ్యంతో పోల్చుకుంటే మెడికల్‌ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. గోవాలో 84.6 శాతం, కర్ణాటక 67, లద్దాక్‌ 66.7, జార్ఖండ్‌ 59.2, ఉత్తరాఖండ్‌ 57.6 శాతం తక్కువ సిబ్బంది ఉన్నట్లు ప్రిజన్స్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా–2021 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంస్కరణ శూన్యం 
సంస్కరణల కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లలో..ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారా? నేరస్తులు పరివర్తనం చెందుతున్నారా? జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నారు? మళ్లీ నేరాల వైపు మళ్లుతున్నారా? ఈ మేరకు పరిశీలన జరుగుతోందా? అంటే..లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏవైనా ఘోరమైన నేరాలు జరిగినప్పుడు తాత్కాలికంగా ఈ అంశంపై దృష్టి పెడుతున్నారని, ఆ తర్వాత షరా మామూలే అనే విమర్శలు ఉన్నాయి. సంస్కరణలతోనే నేరాల సంఖ్య తగ్గుతుందని, తద్వారా ఖైదీల సంఖ్య తగ్గుతుందని జైళ్ల విభాగం విశ్రాంత ఉన్నతాధికారులు అభిప్రాయం పడుతున్నారు. 

సంస్కరణలు అవసరం 
జైళ్లలో ఖైదీలను పశువుల్లా చూస్తున్నారు. ఖైదీలంటే పూర్తి చులకన భావన సరికాదు. వారిని సన్మార్గంలో నడిపించడానికి జైళ్ల సంస్కరణలు అవసరం. జైలుకు వచ్చేవారిని కఠినంగా శిక్షించాలనే అభిప్రాయం సరికాదు. కఠిన శిక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేయడమే. జైళ్ల సంస్కరణలు రాకుండా సమాజంలో నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. బ్రిటిష్‌ హయాంలో స్వాంతంత్య్ర సమరయోధులను తప్ప.. మిగిలిన ఖైదీలను బాగానే చూసేవారు. జైళ్ల సంస్కరణలు తీసుకురావాలని కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు నేను పలుమార్లు విజ్ఞప్తి చేశా. కానీ స్పందన లేదు. 
– జైళ్ల విభాగం మాజీ డీజీపీ వీకే సింగ్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top