ఇంగ్లిష్ పై పట్టు సాధించారు | Every Child Read success in government schools | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్ పై పట్టు సాధించారు

Apr 24 2026 3:21 AM | Updated on Apr 24 2026 3:21 AM

Every Child Read success in government schools

ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్‌’ సక్సెస్‌ 

ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ ఆలోచనతో అమలు 

జిల్లాలోని 1–5 తరగతుల విద్యార్థులకు బోధన

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఇంగ్లిష్‌ అబ్బేలా ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి చేసిన వినూత్న ఆలోచన విజయవంతమైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1–5వ తరగతుల విద్యార్థుల కోసం అమలు చేసిన ‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్‌’తో ఏడు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అక్షరాలు నేర్చుకోవడం నుంచి ప్రారంభించి, పదాలు రాయడం, వాక్యాల నిర్మాణం.. పూర్తిగా చదివేలా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 26 వేల మంది విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది.  

అలా మొదలై.. 
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లంపై పట్టు పెంచాలన్న సంకల్పంతో ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ 2025 అక్టోబర్‌లో ‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్లో చాలామందికి పూర్తిగా ఇంగ్లిష్‌ పదాలు, వాక్యాలు చదవడం రాలేదు. అయితే ఆరు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసిన ఈసీఆర్‌ (ఎవ్రీ చైల్డ్‌ రీడ్‌) యాప్‌ ద్వారా ప్రతీవారం సుమారు 26వేల విద్యార్థుల ఇంగ్లిష్‌ పఠన స్థాయిని ఉపాధ్యాయులు నమోదు చేశారు. ప్రతీ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో నమోదు చేస్తుండగా, కలెక్టర్, ప్రతీ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ పర్యవేక్షణతో పురోగతి కనిపించింది. 

ఒక్కో మెట్టుతో ముందుకు.. 
మొదటి వారంలో కేవలం 11 శాతం మంది విద్యార్థులు మాత్రమే వాక్య స్థాయిలో చదవగా, 21వ వారానికి 85 శాతం మంది విద్యార్థులు వాక్యాల స్థాయికి చేరితే, అక్షరాల దశలో కేవలం ఒక శాతమే ఉన్నారు. వాక్య పఠనంలో ఈ ఏడాది 2వ తరగతిలో 53 శాతం, 3వ తరగతిలో 71 శాతం, 4వ తరగతిలో 73 శాతం, 5వ తరగతిలో 86 శాతం పురోగతి నమోదైంది. ఎవ్రీచైల్డ్‌ రీడ్స్‌ను ఖమ్మం జిల్లాలో ప్రారంభించాక మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేశారు.  

నూరుశాతం పఠనా నైపుణ్యాలను సాధించాలి  
ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎవ్రీచైల్డ్‌ రీడ్స్‌ కార్యక్రమాన్ని చేపట్టాం. ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో 26 వేల మంది విద్యార్థులు పూర్తి పఠన నైపుణ్యం సాధించారు. ప్రారంభంలో కేవలం 12–13 శాతం మందే వాక్యాలు చదవగలిగితే, ప్రస్తుతం అది 84 శాతానికి పెరిగింది. ప్రతిరోజూ ఒక గంట సమయం కేటాయించగా మంచి ఫలితాలు వచ్చాయి.  – అనుదీప్‌ దురిశెట్టి, కలెక్టర్, ఖమ్మం

Advertisement
 
Advertisement
Advertisement