Evaru Meelo Koteeswarulu: రాజా రవీంద్రను కోటీశ్వరున్ని చేసిన ప్రశ్న ఇదే..

Evaru Meelo Koteeswarulu SI Raja Ravindra Won Rs 1 Crore - Sakshi

Evaru Meelo Koteeswarulu 1cr Question: రాజా రవీంద్ర.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌. అనుకోకుండానే 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి హాజరై జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో అడిగిన 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అనంతరం మంగళవారం నాటి ఎపిసోడ్‌లో చెక్కు అందుకున్నారు. దీంతో ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర నిలిచారు. ఈ షోలో రాజా రవీంద్ర ప్రయాణాన్ని మనం ఒకసారి గమనిస్తే.. 

రాజా రవీంద్రను హాట్ సీట్‌కి తీసుకెళ్లిన ప్రశ్న.. 
హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి?
A)న్యూయార్క్  
B)ముంబయి  
C)దుబాయ్  
D)విజయవాడ

ప్రశ్న చదవగానే సమాధానం అందరికీ తెలిసినట్టు అనుకున్నా హాట్‌సీట్‌పై కూర్చొని తక్కువ సమయంలోనే సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్‌కు తొలి ప్రాధాన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో రాజా రవీంద్ర కేవలం 2.637 సెకన్లలోనే సమాధానం ఇచ్చి హాట్‌సీట్‌ను చేరుకున్నారు. ఇక​ అక్కడ నుంచి ఆయన వరుసగా సరైన సమాధానాలు చెప్తూ ఎన్టీఆర్‌ను సైతం ఆకట్టుకున్నారు.

చదవండి: (Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!)

సోమవారం ప్రసారమైన ప్రోగ్రాంలో ఆయన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉన్న మూడు లైఫ్‌ లైన్లలో కేవలం ఒక్క దానిని మాత్రమే ఉపయోగించుకొని 12,50,000 గెలుచుకున్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడానికి మరో మూడు ప్రశ్నల దూరంలో నిలిచారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జరిగిన షోలో రాజా రవీంద్ర కోటి రూపాయల వైపు అడుగులు వేసిన ప్రశ్నలను ఒకసారి చూస్తే.. ఆట ప్రారంభం కాగానే జూనీయర్‌ ఎన్టీఆర్‌.. రాజా రవీంద్రను 25 లక్షల రూపాయల ప్రశ్న అడిగారు. ఒక్క లైఫ్‌ లైన్‌ను అప్పటికే ఉపయోగించడం వల్ల ఇక రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 25 లక్షలకు రాజా రవీంద్రను అడిగిన ప్రశ్న..

2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్‌ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది?
A)లాక్‌డౌన్‌
B)ఐసోలేషన్‌
C)క్వారంటైన్‌
D)పాండమిక్

ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన రాజారవీంద్ర మరో లైఫ్‌ లైన్‌ను ఉపయోగించుకుని క్వారంటైన్‌ అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో 50 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకున్నారు. ఈ షోలో పాల్గొని 50 లక్షల ప్రశ్నకు చేరుకున్న అతి తక్కువ మందిలో రాజారవీంద్ర ఒక్కరు. 50లక్షల ప్రశ్నను పరిశీలిస్తే.. 

జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు?
A)మిజోరాం
B)పశ్చిమబెంగాల్‌
C)ఉత్తరప్రదేశ్‌
D)కేరళ

ఈ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించి ఆప్షన్‌ బీ అంటూ కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే ఇద్దరు మాత్రమే కోటి రూపాయల ప్రశ్నను చూశారు. వారిలో ఒకరు సెకండ్‌ సీజన్‌లో అయితే.. ఇప్పడు రాజారవీంద్ర మాత్రమే. ఇక కోటి రూపాయల ప్రశ్నను పరిశీలిస్తే.. 

1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు?
A)రంగనాథ్‌ మిశ్రా
B)రంజిత్‌సింగ్‌ సర్కారియా
C)బీపీ మండల్‌
D)ఫజల్‌ అలీ కమిషన్‌
ఈ ప్రశ్నకు చాలా సేపు థింక్‌ చేసి ఉన్న మరో లైఫ్‌ లైన్‌ ఉపయోగించుకొని ఆప్షన్‌ డీ అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. దీంతో ఈఎమ్‌కే చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు. 

చదవండి: (Evaru Meelo Koteeswarulu: కోటితో ఆగను.. అదే నా అసలు స్వప్నం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top