టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో 'భూ'కంపం

Etela Rajender Gives Clarification On Land Scam Allegations - Sakshi

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు.. నేరుగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రైతులు 

దానికి సమర్థనగా మాట్లాడిన కొందరు అధికారులు 

వెంటనే స్పందించి మంత్రిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం 

ఆరోపణలపై ఘాటుగా సమాధానమిచ్చిన మంత్రి ఈటల 

తాను నిప్పు అని, అవసరమైతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని వ్యాఖ్య 

రాష్ట్రంలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం 

ఆరోపణలున్న మంత్రులందరిపైనా విచారణ చేపట్టాలని ప్రతిపక్షాల డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటల్లో భూముల కబ్జా ఆరోపణలు టీఆర్‌ఎస్‌ సర్కారులో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి ఈటల రాజేందర్‌ తమ భూములను కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు నేరుగా లేఖ రాయడం.. సీఎం కేసీఆర్‌ వెంటనే ఈ విషయంలో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం.. తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి ఈటల ఘాటుగా స్పందించడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపాలిటీ ఎలక్షన్ల పోలింగ్‌ శుక్రవారం సాయంత్రం ముగుస్తున్న సమయంలోనే.. శరవేగంగా జరిగిన ఈ పరిణామాలతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది.

ప్రభుత్వంలో మంత్రిపై ఆరోపణలు రావడం, ఇదే సమయంలో కొందరు అధికారులు ఆ ఆరోపణలను సమర్థించేలా మాట్లాడటం, సీఎం వెంటనే విచారణకు ఆదేశించడంపై అన్ని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ‘స్కూటర్‌పై తిరిగిన వాళ్లు వేలకోట్లకు ఎదిగారు. ఒక్క సిట్టింగ్‌ లోనే వేలు, వందల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చినయ్‌..’ అని మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రివర్గంలో ఇంకొందరిపైనా ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటిపైనా వెంటనే విచారణ జరపాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు.      

నిగ్గు తేల్చండి: సీఎం కేసీఆర్‌ 
మాసాయిపేట మండలంలో తమ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారంటూ రైతులు రాసిన లేఖపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయి లో స్పందించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలని, మెదక్‌ కలెక్టర్‌ నుంచి సమగ్ర నివేదిక తెప్పించాలని సీఎస్‌ను ఆదేశించారు.ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని విజి లెన్స్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌రావుకు బాధ్యత అప్పగించారు. వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top