111 రద్దుపై సుప్రీంకోర్టుకు..! | Sakshi
Sakshi News home page

111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!

Published Mon, May 22 2023 2:26 AM

Environmentalists who want to protect the twin reservoirs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్‌ ఆర్డర్‌ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తమ్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 

పర్యావరణానికి ముప్పు 
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్‌ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు.

1912లో మొదట గండిపేట్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్‌సాగర్‌ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్‌ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి.

‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్‌మెయిన్‌లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు.  

జీవవైవిధ్యానికి హాని 
ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. 

ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది
హైదరాబాద్‌ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు.  – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త 

సూపర్‌ ఆర్డర్‌ను ఎలా ధిక్కరిస్తారు
ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్‌లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది.

గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం.  – ప్రొఫెసర్‌ పురుషోత్తమ్‌రెడ్డి 

Advertisement
 
Advertisement
 
Advertisement