క‘రెంట్‌’ కష్టాలు | Electricity not available uninterruptedly for even four hours a day | Sakshi
Sakshi News home page

క‘రెంట్‌’ కష్టాలు

Oct 15 2026 1:39 AM | Updated on Oct 15 2026 1:39 AM

Electricity not available uninterruptedly for even four hours a day

రోజుకు నాలుగు గంటలైనా నిరంతరాయంగా అందని విద్యుత్‌  

పంటలను కాపాడుకునేందుకు విరివిగా జనరేటర్ల వినియోగం  

రోజు అద్దె రూ.4 వేలపైనే, డీజిల్‌కు మరో రూ.3 వేలు 

పేలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు... పిలిచినా రాని సిబ్బంది.. రైతుల అవస్థలు 

ఫిర్యాదు ఏదైనా.. పరిష్కారానికి కాసులివ్వాల్సిందే

సాక్షి, హైదరాబాద్‌: రైతులను కరెంట్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. కాతాపూత సమయంలో కరెంట్‌ కన్నీళ్లు పెట్టిస్తోంది. వరి వేసిన రైతుకు విద్యుత్‌ శాఖ నిత్యం షాక్‌ ఇస్తోంది. అన్ని జిల్లాల్లోనూ రైతుల పరిస్థితి ఇదే. పగటి పూటే రైతుకు విద్యుత్‌ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పట్టుమని 4 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ అందడం లేదని ‘సాక్షి’ప్రతినిధుల బృందానికి రైతులు తెలిపారు. నిత్యం ఏదో ఒక అంతరాయం వెంటాడుతోందని, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడమో, లైన్లలో సమస్యలో, ఫ్యూజులు పోవడమో... ఏదైతేనేం ఏదో ఒక కారణంతో కరెంట్‌ పోతోందని లబోదిబోమంటున్నారు.  

కరెంట్‌ ఉంటే ఒట్టు 
రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్‌పై నిత్యం ఫిర్యాదులు నమోదవు తున్నాయి. కరెంట్‌ పోయినప్పుడల్లా సమీపంలోని కాల్‌సెంటర్‌కు ఫోన్లు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో రోజుకు 250కిపైగా ఫిర్యాదులు అందుతున్నట్టు విద్యుత్‌ అధికారులే చెబుతున్నారు. తక్షణమే స్పందిస్తున్నామని విద్యుత్‌ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో 80 వేలకుపైగా బోర్లు ఉన్నాయి. సగటున ఒక్కో బోర్‌ 7 హార్స్‌పవర్‌తో ఉంటుంది. 

ఒక హెచ్‌పీ మోటర్‌ గంట వేస్తే, ఒక యూనిట్‌ కాలుతుంది. రైతు కనీసం 10 గంటల పాటు మోటర్‌ పోస్తే తప్ప పంటను కాపాడుకునే అవకాశం లేదు. అంటే 56 లక్షల యూనిట్ల విద్యుత్‌ రైతులకే అవసరం. కానీ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ రోజుకు 10 లక్షల యూనిట్లు దాటడం లేదని విద్యుత్‌ నియంత్రణ మండలికి డిస్కమ్‌లు సమర్పించే వార్షిక ఆదాయ, అవసర నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరాల్లో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో అక్కడి అవసరాలకే కేటాయిస్తున్నారు. దీంతో రైతులకు విద్యుత్‌ అందక అనేక అవస్థలు పడుతున్నాడు. 

జనరేటర్లతో తడిసి మోపెడు 
చేతికొచ్చిన పంటను ఎండబెట్టుకునేందుకు రైతులకు మనసు రావడం లేదు. గింజ గట్టిపడే సమయంలో నీళ్లు అందించేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రైతులు అద్దెకు జనరేటర్లు తెచ్చి మరీ బోర్లు, బావుల నుంచి నీళ్లు తోడుతున్నారు. 480 మండలాల పరిధిలో వేల మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురైందని నివేదికలు చెబుతున్నాయి. ఒక్కో జనరేటర్‌కు రోజుకు రూ.3500 అద్దె చెల్లిస్తున్నారు. మరో రూ.2500 వరకూ డీజిల్‌ ఖర్చు అవుతోంది.  

పిలిస్తే పలికేదెవరు? 
నాణ్యమైన విద్యుత్‌ లేని కారణంగా రైతు మోటర్లు కాలిపోతున్నాయి. విద్యుత్‌ లోడ్‌ పెరిగిపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటిల్లో ఉపకరణాలు వేడికి దెబ్బ తింటున్నాయి. సమస్య ఎదురైనప్పుడు రైతులు విద్యుత్‌ శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను పొలాల వద్దకు చేరవేసేందుకు కూడా డబ్బులు అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులివ్వకపోతే రోజుల తరబడి వాటిని తేవడం లేదని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలోనూ దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.  

కరెంట్‌ ఆశలు సన్నగిల్లినట్టే  
వచ్చే జూలై వరకూ విద్యుత్, నీరు పొదుపుగా వాడాలని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన వ్యవసాయ విద్యుత్‌కు మరింత కోత పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విద్యుత్‌ శాఖ విడుదల చేసిన వివరాలే ఇందుకు నిదర్శనం. విద్యుత్‌ డిమాండ్‌ ఇదే సీజన్‌లో గత ఏడాది 15,906 మెగావాట్లుగా ఉంటే, ఈ ఏడాది 19,892 మెగావాట్లకు చేరింది. గత ఏడాది జూలై–సెప్టెంబర్‌ మధ్య 22,319 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటే, 26,036 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంది. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనేందుకు దొరకడం లేదు. జెన్‌కో లాంటి ఉత్పత్తి సంస్థలకు బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి జరగడం లేదు. ఈ నేపథ్యంలో రబీ సీజన్‌ మాట దేవుడెరుగు... ఖరీఫ్‌లోనూ రైతన్నలకు కష్టాలు తప్పవని విద్యుత్‌ ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు.  

ఇవీ రైతన్నల కష్టాలు... 
» కోనరావుపేట మండలం మరిమడ్లలో ఓ రైతు ఏడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పొట్టకొచ్చే దశలో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. అధికారులు స్పందించలేదు. రోజుకు రూ.5 వేల చొప్పున జనరేటర్‌ కిరాయికి తెచ్చుకొని, ఐదు రోజులుగా వరికి నీరు అందిస్తున్నాడు. 
» రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ గ్రామ రైతులు వంద ఎకరాల్లో సాగు నీరు అందకపోవడంతో వరి పొట్ట దశలో దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్లు తెద్దామన్నా దొరికే పరిస్థితి లేదని చెబుతున్నారు. 
»  మిర్యాలగూడ ప్రాంతంలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. రోజుల తరబడి వాటిని బాగు చేయడం లేదు. లోఓల్టేజీ కారణంగా రైతుల మోటర్లు కూడా దెబ్బతింటున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించడానికీ పెద్ద ఎత్తున సిబ్బంది డబ్బులు అడుగుతున్నారు.  
»  సంగారెడ్డి జిల్లా హత్నూర్‌ మండలం తార్కాన్‌Œపేట గ్రామంలో ఓ రైతు ఆరెకరాలోల వరి వేశాడు. విద్యుత్‌ కోతల కారణంగా పంట దెబ్బతింటోంది. రోజుకు రూ.2 వేల చొప్పున అద్దెకు జనరేటర్‌ తెచ్చాడు. మరో రూ.4 వేలు డీజిల్‌కు ఖర్చు అవుతోందని తెలిపాడు.

రోజుకు రూ.6 వేలు ఖర్చు చేస్తేనే..  
వరి పొలం వద్ద జనరేటర్‌ అమర్చుతున్న ఈ రైతు పేరు అల్లి మీరబాబు. సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామానికి చెందిన ఈయన తొమ్మిది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట ఇప్పుడిప్పుడే పొట్ట దశకు చేరుకుంటోంది. అయితే కరెంట్‌ కోతలకు తోడు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో నీళ్లందించే పరిస్థితి లేకుండాపోయింది. ఈ దశలో వరికి నీళ్లందించడం కీలకం కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రోజుకు ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తూ జనరేటర్‌ ద్వారా పంటకు నీళ్లందిస్తున్నాడు. అయితే ఇలా ఎన్ని రోజులు చేయగలనని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.

ఇదేం కరెంట్‌  
వరి పొట్టకొచ్చే దశలో కరెంట్‌ కన్నీళ్లు పెట్టిస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడమో, ఫ్యూజులు ఎగిరిపోవడమో, వైర్లు తెగిపోవడమో.. రోజూ ఏదో ఒక సమస్యే. అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు.  – ఆకుల చిన నారాయణ, మరిమడ్ల, కోనారావుపేట మండలం  

డబ్బులివ్వందే పనులు కావు 
రోజుకు 6 గంటలు కూడా కరెంట్‌ ఉండటం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోతే రైతులంతా డబ్బులు వేసుకొని ఇవ్వాలి. లేకపోతే కరెంటోళ్లు అస్సలు పట్టించుకోరు. పై అధికారులకు అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు.  
– ధీరావత్‌ గోవింద్, రాళ్లవాగుతండా, మిర్యాలగూడ  

ట్యాంకర్‌ సేద్యం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంటతండాకు చెందిన రైతులు కొర్ర తౌర్యకు అర ఎకరం, రమావత్‌ వసూరాం, రమావత్‌ హనుమ నాయక్‌లకు ఎకరంన్నర భూమి ఉంది. వరి సాగు చేయ­గా, నీరందక ఎండిపోతోంది. దీంతో వారు తండా సమీపంలోని మలాల్‌చె­రువు నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 చొప్పన చెల్లిస్తూ రెండురోజుల్లో 40 ట్యాంకర్ల నీటిని తెప్పించామన్నారు.

చి‘వరి’ఆశ...
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారానికి చెందిన రైతు తెలగాని శేషయ్య తన ఇంటికి ఆనుకుని 80 సెంట్ల భూమిలో వరి సాగు చేశాడు. ఏటా వర్షాకాలంలో వరి సాగు చేస్తుండగా.. భూపాలపట్నం చెరువు కాల్వల ద్వారా నీరు అందేది. కానీ ఈసారి చెరువులోకి నీరు చేరకపోవడంతో శేషయ్య తన ఇంట్లోని బోర్‌కు ఉన్న సింగిల్‌ ఫేస్‌ మోటార్‌తో పైపు వేసి పంటను తడుపుతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement