సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ ఉపఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. రౌడీల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయన్నారు. ఒక ఆడబిడ్డను ఎంత హింసపెట్టాలో అంతా పెట్టారని.. బీఆర్ఎస్ పార్టీకి మద్ధతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సునీత.. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌లు చేయించి, రౌడీయిజంతో గెలిచిందని ఆరోపించారు. పోలింగ్ సెంటర్‌లోనూ తమపై ర్యాగింగ్ జరిగిందన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ కు మద్ధతివ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజారిటీ వచ్చిందన్నారు. వారిది అడ్డదారిలో గెలిచిన గెలుపన్నారు.
ఎలక్షన్ల సందర్భంగా తాను నవ్వినా, ఏడ్చినా తప్పే అన్నట్లు ప్రచారం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. నైతిక విజయం మాత్రం తనదే అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచింది.


