‘సర్‌’...ఫికర్ | ECI announces SIR schedule for Telangana | Sakshi
Sakshi News home page

‘సర్‌’...ఫికర్

May 15 2026 12:56 AM | Updated on May 15 2026 12:56 AM

ECI announces SIR schedule for Telangana

రాష్ట్రంలోనూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రకటన నేపథ్యంలో రాజకీయ పక్షాల అలర్ట్‌ 

ఎన్నికల ప్రధానాధికారితో సమావేశం కావాలని టీపీసీసీ నిర్ణయం 

నేటి మధ్యాహ్నం భేటీకి అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరిన పీసీసీ చీఫ్‌ 

గులాబీ దళమూ అప్రమత్తం.. గ్రామస్థాయి కేడర్‌ను రంగంలోకి దింపే యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ పక్షాలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పిడుగు పడనే పడింది. తెలంగాణతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. గతంలో అసోం, మణిపుర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహించిన సందర్భంగా వచ్చిన ఆరోపణలు, సందేహాల నేపథ్యంలో తమ ఓట్లు జారిపోకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.  

రెడీ అవుతున్న పార్టీలు 
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ సవరణ కేవలం సెక్యులర్‌ ఓట్లను తొలగించేందుకే చేపడుతున్నారని, ఎస్‌ఐఆర్‌ ద్వారా బీజేపీ అనుకూల ఓట్లను జాబితాలో ఉంచి, మిగిలిన పార్టీల సానుభూతిపరుల ఓట్లను పలు కారణాలతో తొలగిస్తున్నారనేది కాంగ్రెస్‌ పార్టీ వాదన. తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ చేపడుతున్నట్టు సీఈసీ చేసిన ప్రకటనతో రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమావేశం కావాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిర్ణయించారు.

ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డితో పార్టీ నేతలతో కలిసి ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఈ భేటీలో భాగంగా రెండు కీలకాంశాలపై ఎన్నికల సంఘం అధికారులతో చర్చిస్తామని మహేశ్‌గౌడ్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఓటరు జాబితా సవరణ నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకుండే అన్ని సందేహాలను తీర్చిన తర్వాతే తుది ఓటరు జాబితా నిర్ధారించాలనే అంశాలపై మాట్లాడతామని, ఎస్‌ఐఆర్‌ విషయంలో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని వివరిస్తామని చెప్పారు. ఓటరు జాబితాలో అవకతవకలు జరగకుండా పార్టీ కేడర్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నామన్నారు.  

ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ కూడా ఎస్‌ఐఆర్‌ విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పార్టీ మద్దతుదారులు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఉండేలా గ్రామస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేస్తోంది. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఇద్దరు కార్యకర్తలకు ఎస్‌ఐఆర్‌పై శిక్షణనిస్తోంది.  
ఎంఐఎం కూడా ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సవరణ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ఇప్పటికే చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని తమ ఓట్లు జారిపోకుండా ఉండే క్రమంలోనే ఎంఐఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement