
ఈఏపీ సెట్‌లో ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే..
తేలికగా జవాబులు ఇచ్చామన్న విద్యార్థులు
తొలిరోజు ప్రశాంతంగా అగ్రి, ఫార్మా పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. తొలి రోజు అగ్రి, ఫార్మా సెట్ జరిగింది. ఈఏపీ సెట్‌పై ఎక్కువ మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. బోటనీ, జువాలజీ పేపర్లలో ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగామని చెప్పారు. కెమిస్ట్రీలో ఈసారి మూలకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని తెలిపారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీపై పట్టు ఉన్న విద్యార్థులు చాలా ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. ఫిజిక్స్‌లో కొన్ని ప్రశ్నలు తేలికగా ఉంటే, మరికొన్ని మధ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ప్రశ్నలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నవే ఇచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని ప్రశ్నలు తిప్పి ఇచ్చినట్టు చెప్పారు. మొత్తంగా రెండు సెషన్లలో పేపర్లు ఈజీగా ఉన్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి పేపర్ సెట్‌ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి, ఈఏపీ సెట్ కన్వీనర్ దీన్‌కుమార్, కో కన్వీనర్, యూనివర్సిటీ రెక్టార్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లిన అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు.
విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉదయం, సాయంత్రం రెండు షిప్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం షిప్టులో 28,834 మంది సెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే, వారిలో 26,741 మంది పరీక్ష రాశారు. సాయంత్రం షిప్టులో 28,830 మందికి స్లాట్ అలాట్ చేయగా, 26,964 మంది హాజరయ్యారు. మొత్తంగా ఉదయం 92 శాతం, సాయంత్రం 95 శాతం విద్యార్థులు పరీక్ష హాజరైనట్లు అధికారులు తెలిపారు.
ఎక్కువ మంది హైదరాబాద్ నుంచే
హైదరాబాద్‌లో నాలుగు జోన్లు ఏర్పాటు చేయగా, ఎక్కువ మంది ఈ ప్రాంతాల నుంచే దరఖాస్తు చేశారు. పరీక్ష హాజరు శాతం కనిష్టంగా 91.3 శాతం, గరిష్టంగా 95 శాతం నమోదైంది. జిల్లాల్లో పరీక్షకు దరఖాస్తు చేసింది తక్కువే అయినా ఎక్కువ మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 97 శాతం, సాయంత్రం 100 శాతం హాజరు నమోదైంది.
అన్నిచోట్లా హడావుడి
తొలి రోజున అన్నిచోట్లా హడావుడి కన్పించింది. పరీక్ష కేంద్రాలను ముందే చూసుకునేలా సెట్ అధికారులు ఈసారి క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచారు. మరోవైపు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద కొద్దిసేపు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారు.
ఆదిలాబాద్ జిల్లాలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు విద్యార్థులు ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని టెన్షన్ పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్లు సకాలంలో ఆన్ అవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు.