Hyderabad: ఈసారి మరింత జోష్‌గా.. సీసాలు ఎత్తి పడేశారు.. వారం రోజుల్లో రూ.222 కోట్ల మద్యం అమ్మకాలు

Dussehra 2021: Liquor Sales Collects Around 222 Crores In One Week - Sakshi

దసరా రోజు సరదాగా గడిపిన నగరవాసులు

గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో చికెన్, మటన్‌ విక్రయాలు

వారం రోజుల్లో రూ.222.23 కోట్ల మద్యం అమ్మకాలు

సాక్షి, హైదారబాద్‌: దసరా సందర్భంగా నగరవాసులు సరదాగా గడిపారు. చికెన్, మటన్, మద్యం విక్రయాలు భారీ స్థాయిలో జరిగాయి. చుక్క, ముక్కతో పసందు చేసుకున్నారు. గతేడాది కోవిడ్‌ కారణంగా ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు వెనుకంజ వేసిన  నగరవాసులు ఈసారి  పండగ చేసుకున్నారు. నగరమంతటా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఆనందోత్సాహాలతో నగరం వెల్లివిరిసింది.

ఇదంతా ఒకవైపు అయితే  మరోవైపు  మద్యం అమ్మకాలు కూడా  భారీగా  పెరిగాయి. వారం రోజుల్లో  రూ.222.23 కోట్ల  విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా  ఈ నెల  12 నుంచి 14వ తేదీ మధ్య కేవలం  మూడు రోజుల్లోనే సుమారు  రూ.75 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. దసరా సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల పరిధిలో 7.78 లక్షల  కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల  కేసులు బీర్లు అమ్ముడైనట్లు  అధికారులు పేర్కొన్నారు.

రెండు రోజుల్లో 50 లక్షల కిలోల చికెన్‌..
గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్‌ వినియోగమవుతుంది. కాగా.. గురు, శుక్రవారాల్లో కలిపి దాదాపు 50 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగినట్లు హోల్‌సేల్‌  వ్యాపారులు చెప్పారు. దసరా సందర్భంగా గ్రేటర్‌ ప్రజలు మటన్‌ కంటే ఎక్కువగా చికెన్‌కు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చికెన్‌ అమ్మకాల ద్వారా వెల్లడైంది. మటన్‌ ధర కిలో రూ. 750– 800 ఉండటం.. చికెన్‌ ధర మటన్‌ కంటే సగం ఉండడంతో చికెన్‌కే ప్రాధాన్యమిచ్చారు. గత మూడ్రోజుల్లో మటన్‌ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారుల అంచనా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top