
రెండు గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు
అశ్వారావుపేట రూరల్: దాహం తీర్చుకోవడానికి ఆ రెండు గ్రామాల గిరిజనులు ఏకంగా.. రాష్ట్ర సరిహద్దు దాటాల్సి వస్తోంది. నెల రోజులుగా వారిని వేధిస్తున్న తాగునీటి సమస్య గురువారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొండరెడ్ల గ్రామాలైన గోగులపూడి, కొత్త కన్నాయిగూడెంల్లో నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
ఈ గ్రామాల్లో 50కి పైగా గిరిజన కుటుంబాలు నివసిస్తుండగా, ఒకే తాగునీటి పథకం ద్వారా నీరు అందేది. అయితే, బోరు నుంచి ట్యాంక్‌లోకి నీరు ఎక్కించే ప్రధాన పైపు విరగడంతో సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు.
దీంతో గ్రామస్తులు తాగునీటి అవవసరాల కోసం నిత్యం రెండు కిలోమీటర్లు ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు పొలంలోని బోర్ నుంచి ట్యాంకర్‌తో నీరు తెచ్చుకుని బిందెలు, బకెట్లలో పట్టుకుంటున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రవీణ్‌ను వివరణ కోరగా సమస్య దృష్టికి రాలేదని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.