పండుగ ధమాక షురూ!.. ఇంటింటికి కిలో చికెన్, మద్యం, క్రాకర్స్‌ బాక్స్‌

Diwali Festival: KG Chicken Crackers Liquor To A House At Munugode Over Election - Sakshi

సాక్షి, నల్లగొండ: పండుగ ధమాక షురూ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ తాయిలాల పంపిణీని ప్రారంభించాయి. చికెన్, మద్యంతోపాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇస్తున్నాయి. అంతేకాదు.. ఓట్లు వేయించగలిగే నాయకులకు భారీగా ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ ఓటర్ల ఇంటికే చికెన్, క్రాకర్‌ బాక్సుల పంపిణీని ఆదివారమే ప్రారంభించింది. మరో పార్టీ పంపిణీకి రంగం సిద్ధం చేసింది.

సోమవారం ఉదయం కల్లా  పిల్లలకు క్రాకర్స్‌ అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మరోవైపు పెద్దలకు మద్యం బాటిళ్ల పంపిణీని కూడా షురూ చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కొన్ని చికెన్‌ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. వాటిన్నంటిని తీసుకెళ్లి, ఆయా గ్రామాల్లో ఇంటింటికి పంచేందుకు కొందరు గ్రామ నాయకులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. గ్రామాల్లో చికెన్‌ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్‌ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులను పురమాయించినట్లు సమాచారం.
చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్‌ దోపిడీ..రూ.450 టికెట్‌ రూ.1000పైనే 

గ్రామ, మండల స్థాయి నేతలకు బెస్ట్‌ ఆఫర్లు
గ్రామ మండల స్థాయి నాయకులకు ప్రధాన పార్టీలు దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద మొత్తంలో బొనాంజా ప్రకటించాయి. భారీ మొత్తంలో నగదును నజరానాగా అందజేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ వార్డు సభ్యుని నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకుని వరకు ఓట్లు వేయించగలిగే సత్తాను బట్టి రూ.25 వేల నుంచి రూ.2లక్షలు వరకు ముట్టజెప్తున్నట్లు తెలిసింది. మరో ప్రధాన పార్టీ వారు కూడా రూ.10వేల నుంచి మొదలుకొని రూ.లక్షన్నర వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల పుణ్యమాని నియోజకవర్గంలో పండుగ అంతా పార్టీల విందులతోనే గడిచిపోతోంది. గత కొన్ని రోజులుగా నియోకవర్గంలో పొద్దంతా ప్రచారం, సాయంత్రం మద్యం సిట్టింగ్‌లు వేస్తూ విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో బయట నిర్వహించే సిట్టింగ్‌లు బంద్‌ చేసి ఇంటికే మద్యం, మాంసం పంపిణీలో పడ్డాయి.
చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు

మహిళలకు చీరలు..
దీపావళి సందర్భంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ పార్టీ నాయకులు మునుగోడు, మర్రిగూడ మండలాల్లో చీరల పంపిణీని ప్రారంభించింది. మరో పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చీరలు పంచితే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో చీరలు కొనుక్కొమ్మని డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top