
ఊరంతా మారుపేర్లే
అలా పిలిస్తేనే ఆనందం
జగిత్యాల జిల్లా కమ్మరిపేటలో వింత సంస్కృతి
మేడిపల్లి(వేములవాడ): ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకమైన వింతలు ఉంటాయి. జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో కూడా మారుపేర్ల (నిక్ నేమ్) వింత ఉంది. గోదావరి జిల్లాల్లో వెటకారం ఉన్నట్లు, కమ్మరిపేటలో కూడా వెటకారంతో కూడిన ప్రేమలు ఉంటాయి.
మచ్చుకు కొన్ని మారుపేర్లు
కమ్మరిపేటలో కొందరిని తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో కాకుండా మారుపేర్లతోనే గుర్తిస్తా రు. ఉదాహరణకు.. నల్లోడు, కోడిజుట్టుగాడు, బర్లోడు, గుడుగుడు మల్లయ్య, బూటుగాడు, సెంబుగాడు, కటకట రాయడు, బారెపు మల్లయ్య, బొట్టుగాడు, దస్తగిరిగాడు, జేంకొరుకుడు, ఆపకా యేగాడు, సెట్టెపిసోడు, పొట్టన్న, బీపిగాడు, ఎద్దుగాడు, పిసోడు, పొట్టోడు, బుడ్డిగాడు, యాస్టీంగ్‌గాడు, నరుకుడుగాడు, పిర్రలెంకడు, మల్కుమల్లోజీ, ఒక్కపొద్దు, బొమ్మగాడు, సాంబర్‌గాడు, పత్తగాడు, బొంబాయిగాడు, బ్రహ్మంగారు, తత్తర్‌గాడు, గొట్టాలు, గుండంగాడు.. ఇలా దాదాపు ఊరందరికీ మారుపేర్లు ఉన్నాయి.
అవసరమైనప్పుడు అండగా..
కమ్మరిపేటలో గ్రామస్తులందరూ వరుసలతో పాటు వెటకారం జోడించి మారుపేర్లతో పిలుచుకుంటారు. ఇలా పిలవడం ఎదుటివారిని తక్కువ చేసినట్లు అస్సలు కాదు. ప్రేమగా ఇలా పిలుచుకోవడంలో గ్రామస్తులంతా ఆదర్శంగా నిలుస్తారు. గ్రామంలో ఎవరికైనా, ఏ సమయంలోనైనా సమస్య వచ్చినా.. అందరూ తలో చేయి వేసి ఆదుకుంటారు. ఎవరైనా చనిపోతే కులమతాలకు అతీతంగా దగ్గరుండి కార్యాలు జరుపుతారు. ఈ విషయంలో చాలా మంది పెద్దలు కమ్మరిపేట గ్రామాన్ని ప్రశంసిస్తారు. భీమారం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేందుకు కమ్మరిపేట గ్రామస్తులు తమదైన పాత్ర పోషించారు. ఇలా చాలా విషయాల్లో కమ్మరిపేట మండలంలో ఆదర్శంగా నిలుస్తోంది.
మారుపేరుతోనే పిలుస్తారు
నాపేరు బినవేని రెడ్డి. కానీ మా గ్రామంలో ఇంటివారు పెట్టిన పేరుతో పిలవరు. మారుపేర్లతోనే ఎక్కువగా పిలుస్తారు. మా పూర్వీకులు బర్లు కాసేవారని నన్ను బర్ల రెడ్డి అంటారు. మా ఊర్లో దాదాపు అందరినీ ఇలాగే పిలుస్తారు.
– బినవేని రెడ్డి, కమ్మరిపేట
అలా పిలిస్తేనే ప్రేమ..
సరదాగా మారుపేర్లతో పిలవడం మా ఊరి వెటకార భాషలో భాగం. అలా పిలిచినా ఎవరూ ఇబ్బంది పడరు. అలా పిలిస్తేనే గుండెకు దగ్గరగా.. ప్రేమతో పిలిచినట్లు భావిస్తారు. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదైన విషయంలో భేదాభిప్రాయాలున్నా ఇతర గ్రామాల మధ్యవర్తిత్వానికి ఇష్టపడం.
– ఆకునూరి శ్రీనివాస్, కమ్మరిపేట
ఊరంతా ఒక్కటవుతం
చాలా గ్రామాల్లో వరుసలు పెట్టి పిలుస్తారు. మా గ్రామంలో వరుసలతో పాటు వెటకారం జోడించి పిలుస్తాం. ఇది ఎప్పటినుంచో వస్తున్న పరంపర. ఏ వర్గంవారైనా వరుసపెట్టి పిలవడం మాకు అలవాటు. మా గ్రామంలో గొడవలు పడ్డా.. ఇతర గ్రామాలు ఒత్తిడి ప్రయోగిస్తే ఊరంతా ఒక్కటవుతం. ఇది మా ఊరు గొప్పతనం.
– గొల్ల ముఖేశ్, కమ్మరిపేట