కౌన్‌బనేగా!?
నేడు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఏర్పాట్లు చేసిన అధికారులు కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు నోటీసులు నేడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం
జగిత్యాల: మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్లు, పోలీసు అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్పెషల్ అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.
ఉదయం 11 గంటలకు సమావేశం
చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు గెలిచిన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11 గంటలకు ఆయా బల్దియాల్లో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బెదిరింపులకుగానీ, ఇతరత్రా ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగకుండా ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో..
మున్సిపల్ ప్రత్యేక సమావేశం స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కలెక్టర్ సత్యప్రసాద్ నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఈ ఎన్నిక నిర్వహిస్తారు. మరో ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఉంటారు. ప్రత్యేక సమావేశంలో ముందుగా రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు వేర్వేరుగా నేమ్స్ అల్ఫాబెట్స్ ఆర్డర్‌లో ఏర్పాటు చేస్తారు. అలాగే ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేకు కూడా ప్రత్యేక స్థానం కేటాయిస్తారు.
ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం
ముందుగా నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లతో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. చైర్మన్ అభ్యర్థిని ఓ కౌన్సిలర్ సభ్యుడు ప్రతిపాదిస్తే మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. చైర్మన్ పదవికి ఒకటికంటే ఎక్కువ ప్రతిపాదనలు వస్తే చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కువ మద్దతు పొందిన అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నికై నట్లు ప్రకటిస్తారు. వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఈ విధంగానే ఎన్నుకుంటారు.
కోరం ఉండాల్సిందే..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు తప్పకుండా కోరం ఉండాల్సిందే. ఒకవేళ కౌన్సిల్ సభ్యులు హాజరు కాకపోతే ఎన్నికను మరునాటికి వాయిదా వేస్తారు. ఎన్నికై న కౌన్సిలర్లలో సగం కంటే ఎక్కువ కోరం ఉండాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు ఎన్నిక నిర్వహిస్తారు.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కడిక్కడే స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
11 గంటలలోపు విప్ జారీ
చైర్మన్ ఎన్నికకు ముందు
ఉదయం 11 గంటలలోపే కౌన్సిల్ సభ్యులకు విప్ జారీ చేస్తారు. మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుల ప్రకారం జరగడంతో కౌన్సిలర్లందరికీ విప్ వర్తిస్తుంది. పార్టీ విప్‌గా నియమించిన వ్యక్తి మున్సిపల్ సభ్యుడైతే సమావేశంలో పాల్గొంటాడు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం విప్ నియామకం జరుగుతుంది.


