Dharani land laws are combined with the experts to create a revenue code - Sakshi
Sakshi News home page

Dharani: 124 భూచట్టాలన్నీ కలిపి రెవెన్యూ కోడ్‌ తేవాలంటున్న నిపుణులు

Published Tue, Feb 21 2023 2:53 AM

Dharani land laws are combined with the experts to create a revenue code - Sakshi

రాష్ట్రంలో భూముల వివాదాలు, సమస్యలను పరిష్కరించడం కోసం సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెచ్చే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 భూ చట్టాలన్నింటినీ కలిపి.. రెవెన్యూ కోడ్‌ (ఒకే చట్టం)గా రూపొందించాలని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోని భూముల పరిపాలన, హక్కుల కల్పన, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ‍్చినా.. దాన్ని కేవలం ఒక్క భూహక్కుల రికార్డుల చట్టం–1971ని సవరించి తెచ్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. దీనితోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని భూచట్టాలను కలిపి కొత్తగా సమగ్ర చట్టాన్ని తెస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. 

దేశవ్యాప్తంగా ‘కోడ్‌’ ప్రయత్నాలు 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 2016లోనే రెవెన్యూ కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. అది దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా దాదాపు ఒకే తరహా చట్టంతో రెవెన్యూ పాలన చేస్తున్నాయని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోనూ కొత్త సమగ్ర చట్టం కోసం ఇటీవలే మంత్రులు, సీనియర్‌ అధికారులతో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశమంతా రెవెన్యూ కోడ్‌ వైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలోనూ ఆ దిశలో ప్రయత్నాలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్‌ఓఆర్, కౌలుచట్టం, ఇనామ్‌ల రద్దు, అసైన్డ్‌ భూముల చట్టం వంటివన్నీ రద్దు చేసి ఒకే చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక కూడా అందించారు.  

రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే.. 

వాస్తవానికి తెలంగాణలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మొదలైంది. నాటికి ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను నల్సార్‌ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో మేరకు రెవెన్యూ చట్టాలను పునఃసమీక్షించిన నల్సార్‌ వర్సిటీ 30 పేజీలతో కూడిన సమగ్ర భూచట్టాల ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఈ ముసాయిదా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. భూ వి వాదాలు తగ్గేలా, పాలన సులభతరం చేసేలా, గందరగోళానికి తావులేకుండా ఉండే సమగ్ర భూచట్టాన్నిరూపొందించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 


 హక్కుల చిక్కులు తీర్చేదిశగా.. భూచట్టాల నిపుణులు చేస్తున్న సూచనలివీ.. 
భూసమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు సర్వేకు ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా తక్కువ సమయంలోనే సర్వే చేయవచ్చు. ఇందుకోసం సర్వే, హద్దుల చట్టం–1923 స్థానంలో కొత్త చట్టం తేవాలి. ఈ సర్వే పూర్తయ్యేలోపు భూలావాదేవీ జరిగిన ప్రతిసారీ సంబంధిత భూమిలో సర్వే జరగాలి. సర్వేయర్ల కొరతను నివారించేందుకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. 

– భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్‌ గ్యారెంటీ చట్టాన్ని తేవాలి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం చేయాలి. 

– భూసంబంధిత అంశాల విషయంలో ఒకే చట్టం ఉండి.. ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. అమలు చేసే వారికీ సులభంగా ఉంటుంది. అన్ని భూచట్టాలను కలిపి రెవెన్యూ కోడ్‌గా రూపొందించాలి. 

– ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రికార్డులన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలు గుర్తించి.. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి వాటిని పరిష్కరించాలి. 

– భూవివాదాల పరిష్కార చట్టాన్ని తెచ్చి జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్‌ జడ్జి లేదా రెవెన్యూ నిపుణుల నేతృత్వంలో అవి పనిచేయాలి. 

– కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కచి్చతంగా చట్టాల్లో మార్పు రావాలి. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి. 

– పేదలకు భూసమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవడంలో సాయం అందించేందుకు పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 

– భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి. భూవిధానం, వినియోగం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. ఇందుకోసం భూపరిపాలనను మెరుగుపర్చాలి. భూఅకాడమీ ఏర్పాటు చేసి భూపరిపాలనలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు జరపాలి. 

– ఈ అన్ని చర్యలు తీసుకునేందుకు వీలుగా భూకమిషన్‌ను ఏర్పాటు చేయాలి. 

 రైతులు, సామాన్య ప్రజల డిమాండ్లు ఇవీ.. 
– భూములను రీసర్వే చేయాలి. భూరికార్డులను సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి. 
– పేదలకు భూములను పంపిణీ చేయాలి. కౌలు దారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. 
– సాదాబైనామా భూములను క్రమబదీ్ధకరించాలి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి. 
– రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న వారికి పట్టాలివ్వాలి. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. 
– అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్‌ భూములను తిరిగి ఇప్పించాలి. మహిళలకు భూహక్కులు కలి్పంచాలి. పారాలీగల్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి. 
 
ధరణితోపాటు ఇతర సమస్యలూ ఉన్నాయి 
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేవలం ధరణి పోర్టల్‌ను సరిచేస్తే భూవివాదాలన్నీ సమసిపోతాయనే అభిప్రాయం కనిపిస్తోంది. కానీ ధరణి మాత్రమే సర్వరోగ నివారిణి కాదు. దాని చుట్టూనే చర్చ జరగడం సమంజసం కాదు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలోనే ‘ల్యాండ్‌ క్యారవాన్‌’ పేరుతో రాష్ట్రంలో దాదాపు మూడువేల కిలోమీటర్లు ప్రయాణించి పదివేల మందికిపైగా రైతులను, భూయజమానులను కలిసి నివేదిక రూపొందించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం (రెవెన్యూ కోడ్‌)గా రూపొందించడం, భూములను రీసర్వే చేయడం, జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడం, టైటిల్‌ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడం ఈ నివేదికలో ప్రధానమైనవి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 
భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు   

Advertisement
Advertisement