కొత్తగా 40 లక్షల టన్నుల గోదాములు

Department of Agricultural Marketing Decided To Construct 40 Lakh Tonnes Of Godowns - Sakshi

రూ.4 వేల కోట్లతో నిర్మించేందుకు కార్యాచరణ

కోటి టన్నులకు పైగా పెరగనున్న సామర్థ్యం 

గోదాముల నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం 

మండలానికి ఒకటి చొప్పున ఉండేలా ప్రణాళిక 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా గోదాముల నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఒకేసారి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాముల ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతీ మండలానికి ఒక గోదాము ఉండేలా సన్నాహాలు చేస్తోంది. అందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిద్ధం చేసింది. ఒక్కో మెట్రిక్‌ టన్ను గోదాము సామర్థ్యానికి రూ.10 వేల చొప్పున, మొత్తంగా రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్గాలు వెల్లడించాయి.  

1.12 కోట్ల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి చేరిక
రాష్ట్ర ఏర్పాటు సమయంలో 39.01 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్‌ గోదాములు (ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి కలుపుకొని) 72.26 లక్షల మెట్రిక్‌ టన్నులున్నాయి. మార్కెటింగ్‌శాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు గోదాముల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భజలాల పెరుగుదలతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు విస్తారంగా అందుబాటులోకి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడిని అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. దీంతో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకొనేందుకు సరిపడా గోదాములు అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తోంది.

ఈ పరిశ్రమల కోసం కూడా గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకే ఏకంగా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవి పూర్తయితే 1.12 కోట్ల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోదాములు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి.  

యాసంగి అవసరాలకు 20.18 లక్షల మెట్రిక్‌ టన్నులే... 
ప్రస్తుతం ఉన్న గోదాముల్లో ఆహారధాన్యాలు, ఇతరత్రా నిల్వలు చేయగా యాసంగి అవసరాలకు 20.18 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సామర్థ్యం యాసంగిలో వచ్చే ధాన్యానికి ఏమాత్రం సరిపోయేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కనీసం 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించినా వీటిని ఎక్కడ నిల్వ చేయాలన్నది ప్రశ్నార్థంగా మారింది. ధాన్యాన్ని మళ్లీ స్కూళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, మిల్లింగ్‌ పాయింట్లలో నిల్వ చేయక తప్పేలా లేదు. దీంతో కొత్త గోదాములను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top