
విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై ప్రభావం
‘కొత్తగూడెం ఎయిర్‌పోర్టు’కు మళ్లీ అడ్డంకి
గుర్తించిన రెండో స్థలం కూడా యోగ్యం కాదని తేల్చిన ఏఏఐ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయంతోపాటే పనులు ప్రారంభిద్దామనుకున్న కొత్తగూడెం విమానాశ్రయ కసరత్తుకు అవాంతరం ఎదురైంది. విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని భావించి గుర్తించిన స్థలం పనికిరాదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తేల్చిచెప్పింది. దీంతో కొత్తగూడెం విమానాశ్రయానికి మరో స్థలం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దీని నిర్మాణ కసరత్తులో జాప్యం తప్పేలా కనిపించటం లేదు.
ముచ్చటగా మూడో స్థలం కోసం..
రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాల్లో కొత్తగూడెం కూడా ఒకటి. ఇందులో వరంగల్ శివారులోని మామునూరు పాత ఎయిర్‌స్ట్రిప్ ఉన్న స్థలంలో భారీ విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దాని తర్వాత రెండో విమానాశ్రయంగా కొత్తగూడెంను ముందుకు తెచ్చారు. ప్రతిపాదించిన సమయంలో తొలుత పాల్వంచ సమీపంలోని గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని గుర్తించారు.
అది అనుకూలంగా లేదని ఏఏఐ తేల్చటంతో గతేడాది చివరలో కొత్తగూడెం మండలంలోని రామవరం, సుజాతనగర్ మండలం పరిధిలో సుజాతనగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామాల సరిహద్దులో 950 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పదేళ్ల వాతావరణ నివేదికలు, విండ్‌రోజ్ డయాగ్రామ్ తదితర నివేదికలను స్థానిక అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి నివేదించారు. వీటితోపాటు ఆ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన ఏఏఐ అధికారులు.. ఆ భూమి కూడా యోగ్యంగా లేదని తేల్చి ఉసూరుమనిపించారు.
ప్రతిపాదిత స్థలంలో 2800 మీటర్ల రన్‌వేను నిర్మించాల్సి ఉంది. ఇది తూర్పు–పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ రన్‌వేను 10/28 పద్ధతిలో ల్యాండింగ్, టేకాఫ్ రెండింటికీ ఉపయోగపడేలా నిర్మించాలని నిర్ణయించారు. కానీ, రన్‌వేకు ఉద్దేశించిన ప్రాంతానికి కొంత చేరువగా ఎత్తయిన గుట్టలున్నాయి. అవి గాలి వాటాన్ని అడ్డుకోవటం ద్వారా విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లపై ప్రభావాన్ని చూపుతాయని అథారిటీ తేల్చింది.
తొలుత చిన్న విమానాలకు సరిపడే ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని భావించినా, వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో ఎయిర్‌బస్ విమానం దిగగలిగే రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించాలని నిర్ణయించారు. కానీ, కొత్తగూడెం ప్రాంతం యావత్తు గుట్టలతో నిండి ఉన్నందున అంత పెద్ద విమానాశ్రయానికి అనువైన స్థలం లభించే విషయంలో ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి.