కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో పునరావాస గ్రామాల తరలింపులో జాప్యం 

 Delay in evacuation of resettlement villages in Qawwal Tiger Reserve Adilabad in TS - Sakshi

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో పునరావాస గ్రామాల తరలింపులో జాప్యం 

సర్వే చేసి ఏళ్లు గడస్తున్నా ముందుకు సాగని ప్రక్రియ 

తరలింపు కొలిక్కి వస్తేనే పులుల రాకపోకలకు మార్గం సుగమం   

సాక్షి, మంచిర్యాల: కవ్వాల్‌ పులుల అభయారణ్యంలో కోర్‌ గ్రామాల తరలింపునకు మరికొంత కాలం పట్టేలా ఉంది. చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్న పులులకు స్థిర ఆవాసం ఏర్పడాలంటే కోర్‌ ఏరియాలోని గిరిజన గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలి. ఐదేళ్ల క్రితం సర్వేలో.. నిర్మల్‌ జిల్లా కడెం మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలో 21 పల్లెలు పులి సంచరించే ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు. మానవ సంచారంతో పులులకు ఇబ్బందులు, ఇటు గ్రామస్తులకు ముప్పు ఏర్పడుతుండడంతో గ్రామస్తుల అంగీకారంతో వేరోచోటుకు తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది.

మొదటి దఫా కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 కుటుంబాలు, జన్నారం పరిధిలో మల్యాల, దొంగపల్లి, అలీనగర్‌ గ్రామాల్లోని 168 కుటుంబాలను పునరావాసం కింద తరలించాల్సి ఉంది. మొదట కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 కుటుంబాలను తరలించాలని నిర్ణయించారు. ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) నిర్వాసిత పరిహార ప్యాకేజీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్లు నిండిన వారిని యూనిట్‌గా పరిగణిస్తూ ఇల్లు, మూడెకరాల భూమి, అలా కాకుంటే రూ.10 లక్షల నగదు ఇస్తారు. ఇందులో మొదటి ఆప్షన్‌కు 48 కుటుంబాలు, రెండో ఆప్షన్‌కు 98 కుటుంబాలు సర్వే సమయంలో ఒప్పుకున్నాయి. పునరావాస కాలనీ కోసం కడెం మండలం కొత్తమద్దిపడగ సమీపంలో ఐదు హెక్టార్లు కేటాయించారు. సాగుభూమి కోసం ఇదే మండలంలో నచ్చన్‌ఎల్లాపూర్‌ జీపీ పరిధిలోని పెత్పురులో 107 హెక్టార్లు కేటాయించారు. ఈ రెండు గ్రామాల తరలింపునకే రూ.15 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ప్రాజెక్టు టైగర్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్రాలు 60-40 శాతం వాటాగా భరిస్తాయి. మూడేళ్ల కిందట కేంద్రం నిధులు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిధులు విడుదల చేసింది. ఇప్పటికీ పునరావాస కాలనీలో సదుపాయాలు కల్పించకపోవడంతో తరలింపు మరింత ఆలస్యం కానుంది. మరోవైపు ఎన్‌టీసీఏ గత ఏప్రిల్‌లో మహారాష్ట్రలో కోర్‌ పరిధిలోని గ్రామాలకు పునరావాస ప్యాకేజీ రూ.15 లక్షలకు పెంచడంతో ఈ ప్యాకేజీ ఇక్కడా వర్తిస్తుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.  

నోటిఫికేషన్‌ వస్తేనే తరలింపు 
పునరావాస తరలింపును రెండు కమిటీలు పర్యవేక్షిస్తాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్, రాష్ట్రస్థాయిలో సీఎస్‌ చైర్మన్లుగా ఉంటూ వ్యవసాయ, గిరిజన, అటవీ, వైద్య, విద్య, సాగునీటి శాఖల నుంచి అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ గ్రామాల తరలింపునకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. గ్రామాల తరలింపు జాప్యంపై ఎన్‌టీసీఏ గతంలో లేఖ సైతం రాసింది. ఇప్పటికీ తరలింపు ప్రక్రియ మొదలు కాలేదు. మరోవైపు తమ గ్రామాలను తరిలించేందుకు గిరిజనులు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు రోడ్డు, విద్య, వైద్యం తదితర సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస ప్రాంతాలకు తరలిస్తే తమ జీవనస్థితి మెరుగవుతుందని ఆశపడుతున్నారు.  

కారిడార్‌కే పులులు పరిమితం 
తొమ్మిదేళ్ల కిందట దేశంలో 42వ టైగర్‌ రిజర్వుగా ఏర్పడిన కవ్వాల్‌ అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2015.44 చ.కి.మీ విస్తరించి ఉంది. ఇందులో కోర్‌ ఏరియా 892.23 చ.కి.మీ, బఫర్‌ ఏరియా 1123.21 చ.కి.మీ. ఐదేళ్లుగా కోర్‌ పరిధిలో రూ.లక్షలు ఖర్చు చేసి అనేక చర్యలు చేపట్టినప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులుగా ఉన్న కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, ఆదిలాబాద్‌ డివిజన్లలోనే పులులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతం పులుల రాకపోకలు ఉన్న కోర్‌ కాకుండా కారిడార్‌గా గుర్తించారు. ఇక్కడే కొన్ని పులులు జతకట్టి సంతానోత్పత్తిని పెంచుకున్నాయి. అలా ఫాల్గుణ అనే ఆడపులి రెండు దఫాల్లో 8 పిల్లల్ని కన్నది. ప్రాణహిత తీరం దాటగానే అవతలి వైపు తడోబా=అందేరీ టైగర్‌ రిజర్వ్, ఇటు ఆదిలాబాద్‌ జిల్లా వైపు తిప్పేశ్వర్‌ పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి. అక్కడ పులుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇరుకు ఆవాసాల్లో ఇమడలేక కొత్త ఆవాసం, తోడు కోసం తెలంగాణ భూభాగంలో అడుగుపెడుతున్నాయి. వలస పులులను కొంతకాలం కవ్వాల్‌లో ఆపగలిగితే దేశంలోనే ప్రముఖ టైగర్‌ రిజర్వుగా మారే అవకాశం ఉందనే అశయంతోనే ఈ టైగర్‌ రిజర్వు ఏర్పాటు చేశారు. కోర్‌ పరిధిలోని కాగజ్‌నగర్‌ డివిజన్‌లో పోడు సాగుదారులకు పులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. వన్యప్రాణుల నష్టపరిహారం పెంపుపై కమిటీ వేసిన ప్రభుత్వం కోర్‌ పరిధిలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మాత్రం జాప్యం చేస్తోంది. దీనిపై నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఎఫ్‌డీవో కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల తరలింపు కోసం నోటిఫికేషన్‌ రాగానే ప్రక్రియ మొదలవుతుందన్నారు. మా ఊళ్లో సౌకర్యాలు లేవు.. 

మా గ్రామాన్ని వేరే ప్రాంతాన్ని తరలిస్తామని అటవీ అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ తరలించడం లేదు. మా ఊళ్లో కనీస సౌకర్యాలు లేవు. పునరావాస ప్రాంతానికి వెళ్తే సౌకర్యాలు ఉం టాయని గ్రామస్తులం అనుకుంటున్నాం.   – గాదె బచ్చవ్వ, రాంపూర్,  కడెం మండలం, నిర్మల్‌ జిల్లా 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top