బీఈడీ అభ్యర్థులకూ పేపర్‌–1 అవకాశం | DED Students Worried That Changes In Teacher Eligibility Test TET | Sakshi
Sakshi News home page

బీఈడీ అభ్యర్థులకూ పేపర్‌–1 అవకాశం

Apr 7 2022 1:09 AM | Updated on Apr 7 2022 3:02 PM

DED Students Worried That Changes In Teacher Eligibility Test TET - Sakshi

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్‌ పేపర్‌–1 రాస్తారు. వీరు సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టులకు (ఎస్‌జీటీ) అర్హులవుతారు.

బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సాధారణంగా పేపర్‌–2 రాస్తారు. వీరు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్‌–2తో పాటు, పేపర్‌–1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీంతో వారు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే కాకుండా, ఎస్‌జీటీ పోస్టులకూ పోటీ పడే వీలుంది. దీంతో తమకు అవకాశాలు తగ్గుతాయని డీఎడ్‌ అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపడితే.. 6,500 ఎస్‌జీటీ, 3 వేలపైన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. 

డీఎడ్‌ నాణ్యతపైనే సందేహాలు...
వాస్తవానికి కొన్నేళ్లుగా డీఎడ్‌ కాలేజీల్లో ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ అభ్యర్థులు చెబుతున్నారు. సరైన ఆదరణ లేక ప్రైవేటు కాలేజీలు పెద్దగా దృష్టి పెట్టలేదంటున్నారు. నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో సగం డీఎడ్‌ కాలేజీలు మూతపడ్డాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్‌ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది.

గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు సరైన ఫ్యాకల్టీని నియమించడం లేదనే ఆరోపణలున్నాయి. మారుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సైకాలజీ తెలుసుకుని బోధించే మెళకువలు, ప్రాజెక్టు వర్క్‌లు అసలే ఉండటం లేదని డీఎడ్‌ అభ్యర్థులు అంటున్నారు. 

మాకు అన్యాయమే...
ఉపాధ్యాయ పోస్టుకు బీఈడీ అభ్యర్థులతో సమానంగా మేమెలా పోటీపడగలం. ఎస్‌జీటీ పోస్టులను డీఎడ్‌ వారికే పరిమితం చేస్తే బాగుండేది. చిన్న తరగతులకు బోధించే విధానాలే డీఎడ్‌లో ఉంటాయి. పెద్ద తరగతులకు బీఈడీ సరిపోతుంది. బీఈడీ అభ్యర్థులు తేలికగా మా స్థాయి పోస్టులు సాధిస్తే, మాకు అన్యాయం జరుగుతుంది.
– ప్రవీణ్‌ కుమార్‌ (డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థి)

వారితో పోటీ సరికాదు...
బీఈడీ, డీఎడ్‌ బోధనా విధానంలో చాలా మార్పులున్నాయి. కాలేజీలు కూడా డీఎడ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ప్రయోగాత్మక బోధనా పద్ధతులపై దృష్టి పెట్టడం లేదు. ఇవన్నీ డీఎడ్‌ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో మా స్థాయి పోస్టులకు బీఈడీ వారినీ పోటీకి తేవడం సరికాదు.     
– సంజీవ్‌ వర్థన్‌ (టెట్‌కు దరఖాస్తు చేసిన డీఎడ్‌ అభ్యర్థి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement