రాష్ట్ర డిస్కంలకు అప్పుల షాక్‌! | Debts of electricity distribution companies across the country | Sakshi
Sakshi News home page

రాష్ట్ర డిస్కంలకు అప్పుల షాక్‌!

Published Sat, Apr 15 2023 3:36 AM | Last Updated on Sat, Apr 15 2023 3:19 PM

Debts of electricity distribution companies across the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల అప్పులు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆర్థిక లోటు, నిర్వహణ మూలధన వ్యయం కొరత కారణంగా ఏటా మరింతగా అప్పులు చేస్తున్నాయి. దీంతో 2019–20లో రూ.5.01 లక్షల కోట్లుగా డిస్కంల అప్పులు.. 2021–22 నాటికి రూ.6.2లక్షల కోట్లకు (24%వృద్ధి) ఎగబాకాయి. చాలా రాష్ట్రాల్లో డిస్కంల ఆస్తులతో పోల్చితే వాటి అప్పులు 100 శాతానికి మించిపోయి దివాలా బాటపట్టాయి. అందులో తెలంగాణ సహా మరో మూడు రాష్ట్రాల్లోని డిస్కంల అప్పులు ఆస్తుల కంటే 150శాతానికి మించిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

కేంద్ర విద్యుత్‌ శాఖ తాజాగా ప్రకటించిన డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్‌ నివేదిక ఈ అంశాలను బహిర్గతం చేసింది. విద్యుత్‌ సబ్సిడీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం, బిల్లుల వసూళ్లలో ఆలస్యంతో డిస్కంలు అప్పులు చేయకతప్పడం లేదని ఈ నివేదిక పేర్కొంది. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్‌ డిస్కం యోజన (ఉదయ్‌) పథకం కింద డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్‌ చేసుకోవడంతో కొంత భారం తగ్గిందని తెలిపింది.

రెండింటి పనితీరు మెరుగుపడాలి
రాష్ట్రంలోని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌/ టీఎస్‌ఎస్పీడీ సీఎల్‌)ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై ఈ నివేదికలో కేంద్ర విద్యుత్‌ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు డిస్కంలు కూడా ఇంధన వ్యయం పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా బదిలీ చేయాలని.. డిస్కంల నష్టాలను ప్రభుత్వం టేకోవర్‌ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ఈఆర్సీ ట్రూఅప్‌ ఆర్డర్‌ 2020–21ను జారీ చేయాలని, ఉద్యోగుల వ్యయ భారాన్ని సంస్థ తగ్గించుకోవాలని స్పష్టం చేసింది.

నష్టాల్లో కూరుకుపోయిన ఉత్తర డిస్కం
ఉత్తర తెలంగాణలోని 17 జిల్లాల పరిధిలో 63,48,874 మంది వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్‌.. దేశంలోని 51 డిస్కంలలో 47వ స్థానంలో నిలిచింది. దీనికి 2020–21లో రూ.204 కోట్ల నష్టాలు వచ్చాయి.
ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ సరఫరా అంచనా వ్యయం, వాస్తవ వ్యయం మధ్య తేడా 2020–21లో 0.68 పైసలుకాగా.. 2021–22లో రూ.1.52కి పెరిగింది. అంటే సరఫరా చేసిన ప్రతి యూనిట్‌ విద్యుత్‌పై నష్టాలు గణనీయంగా పెరిగాయి.
సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 2020–21లో 9శాతం ఉండగా.. 2021–22లో ఏకంగా 14.1 శాతానికి ఎగబాకాయి.
 వినియోగదారుల నుంచి కరెంట్‌ బిల్లులను 60 రోజుల్లోగా వసూలు చేసుకోవాల్సి ఉండగా.. ఈ డిస్కం పరిధిలో సగటున 267 రోజులు పడుతోంది.
♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ఏకంగా 40శాతం బిల్లులు వసూలు కాలేదు.

దక్షిణ డిస్కంపై బకాయిల బండ
♦ దక్షిణ తెలంగాణలోని 1,04,36,589 మంది వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఎస్పీడీసీఎల్‌.. దేశంలోని 51 డిస్కంలలో 43వ ర్యాంకు సాధించింది. 2020–21లో రూ.627 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.
♦ సరఫరా చేసిన ప్రతి యూనిట్‌ విద్యుత్‌పై రూ.1.40 నష్టం వస్తోంది.
♦  జెన్‌కోలకు సంస్థ బిల్లుల చెల్లింపులకు 375 రోజులను తీసుకుంటోందని.. దీనిని 45 రోజులకు తగ్గించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
♦  వినియోగదారుల నుంచి కరెంట్‌ బిల్లుల వసూళ్లకు 130 రోజులు తీసుకుంటోంది.
♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి 25శాతం బిల్లులు వసూలు కాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement