జైళ్లలో డీ అడిక్షన్‌ సెంటర్లు | De addiction centers in prisons | Sakshi
Sakshi News home page

జైళ్లలో డీ అడిక్షన్‌ సెంటర్లు

Jun 13 2025 3:46 AM | Updated on Jun 13 2025 3:46 AM

De addiction centers in prisons

నాలుగు చోట్ల ఏర్పాటుకు జైళ్ల శాఖ సన్నాహాలు

ఖైదీలకు మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం

మానసిక, శారీరక పరివర్తన తెచ్చేలా కృషి

డాక్టర్లు ఇతర సిబ్బంది కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన ఖైదీల్లో మానసిక, శారీరక పరివర్తన తెచ్చేలా తెలంగాణ జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శాఖ పరిధిలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో డీ అడిక్షన్‌ (వ్యసన విముక్తి) కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనుంది. చర్లపల్లి, చంచల్‌గూడ, సంగారెడ్డి, నిజామాబాద్‌ సెంట్రల్‌ జైళ్లలో వీటిని ఏర్పాటు చేయనుంది. 

ఇప్పటికే ఆయా జైళ్లలో అవసరం మేరకు భవనాలు గుర్తించారు. కేంద్రాల్లో పనిచేయాల్సిన మెడికల్‌ ఆఫీసర్లు, సైకియాట్రిస్టులు, క్లినికల్‌ సైకాలజిస్టులు సహా ఇతర సిబ్బంది నియామకానికి సంబంధించి జైళ్ల శాఖ తరఫున ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 23 నుంచి మూడురోజుల పాటు డీజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.  

డీ అడిక్షన్‌ టీంలో ఎవరెవరు ఉంటారు
మెడికల్‌ ఆఫీసర్, సైకియాట్రిస్టు, క్లినికల్‌ సైకాలజిస్టులు, ఫిజీషియన్, మోటివేషనల్‌ స్పీకర్లు, మెంటార్లు, యోగా, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్, నర్సింగ్‌ స్టాఫ్, అకౌంటెంట్, అడ్మిన్‌ మేనేజర్‌. 

ఏ ఖైదీలను ఈ కేంద్రాల్లో పెడతారు..
జైళ్లలో ఉండే శిక్ష పడిన, రిమాండ్‌ ఖైదీలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) గైడ్‌లైన్స్‌ ప్రకారం జైల్‌ మెడికల్‌ అధికారి ద్వారా తొలుత హెల్త్‌ స్క్రీన్రింగ్‌ నిర్వహిస్తారు. ఇందులో మత్తు పదార్థాలకు బానిసలైన వారందరినీ గుర్తించి ఎర్రగడ్డలోని మెంటల్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మాత్రమే జైళ్లలో ఏర్పాటు చేయబోతున్న డీ అడిక్షన్‌ సెంటర్లలో ఖైదీలను చేర్చి చికిత్స ప్రారంభిస్తారు. 

రకరకాల క్లాసులు.. వ్యాపకాలు
డీ అడిక్షన్‌ ప్రక్రియలో భాగంగా ఖైదీలకు వ్యక్తిత్వ వికాసం, మోటివేషన్‌ క్లాసులు నిర్వహిస్తారు. సైకియాట్రిస్టులతో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వ్యాపకాల వైపు వారి దృష్టి మళ్లిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగత కౌన్సెలింగ్, గ్రూప్‌ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రతిరోజూ యోగా, పెయింటింగ్, ఆర్ట్‌ థెరపీ తరగతులు, మ్యూజిక్‌ సెషన్స్‌ ఉంటాయి. 

సదుపాయాలు ఇలా..
ప్రతి డీ అడిక్షన్‌ సెంటర్‌లో 20 పడకలు, ఇంటెన్సివ్‌ కేర్‌ రూమ్‌లు, జనరల్‌ అబ్జర్వేషన్‌ రూమ్‌లు, 24 గంటల పాటు నర్సింగ్‌ కేర్‌ సదుపాయాలు ఉంటాయి. 

మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యం 
మత్తుపదార్థాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిపై స్పెషల్‌ డ్రైవ్‌లు పెరగడంతో రాష్ట్రంలోని జైళ్లకు వస్తున్న ఖైదీల్లోనూ డ్రగ్స్‌కు బానిసలైన వారి సంఖ్యా ఎక్కువగా ఉంటోంది. డ్రగ్స్‌కు అలవాటుపడి, నేరాలు చేసి జైళ్లకు వచ్చేవారిని మార్చేందుకు, వారికి డ్రగ్స్‌ నుంచి విముక్తి కల్పించేందుకు.. వారి శిక్షాకాలం సరైన సమయంగా మేం భావిస్తున్నాం. 

శిక్ష పూర్తి చేసుకుని బయటికి వెళ్లే సమయానికి వారిని సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా వారి కుటుంబాలకు, సమాజానికి అందివ్వడమే ఈ డీ అడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. ఖైదీల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక పెంచేలా అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించబోతున్నాం.  – సౌమ్యా మిశ్రా, డీజీ, తెలంగాణ జైళ్లశాఖ 

Advertisement
 
Advertisement
Advertisement