గంగానదీ పుష్కరాలు.. కాశీకి పోలేము రామా హరీ..!

Danapur Express Waiting List Over 400 On River Ganga Pushkaralu 2023 - Sakshi

ఈ నెల 22 నుంచి గంగానదీ పుష్కరాలు

తెలంగాణ నుంచి వేలాది మంది భక్తుల ప్రయాణ ఏర్పాట్లు

ఉన్న ఒక్క దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 400 దాటిన వెయిటింగ్‌ జాబితా

అదనపు రైలు లేక అవస్థలు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్‌ లిస్టు 400ను దాటింది. మే మొదటివారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయింటింగ్‌ చూపుతున్నా ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపటం లేదు. వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేలమంది భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే గంగానదీ పుష్కరాలు ఈ నెల 22 నుంచి మే మూడో తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాలు జరిగే తేదీలతోపాటు వాటికి అటూ ఇటూగా దాదాపు 2లక్షల మందికిపైగా భక్తులు కాశీ యాత్రకు వెళ్తారన్నది ఓ అంచనా. సాధారణ రోజుల్లోనే ఈ ఒక్క రైలు సరిపోక, రోడ్డు మార్గాన అంత దూరం వెళ్లలేక భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాంటిది పుష్కరాల వేళ, రద్దీ అంతకు పదిరెట్లు పెరుగుతున్నా అదనపు రైలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేకపోవటం గమనార్హం.  

భారీగా పెరిగిన విమాన చార్జీలు 
సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్‌ ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలుగా ఉండేది. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్‌ ధర పెంచుకునే డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగా పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్‌ ధరను రెట్టింపు చేసి విక్రయిస్తున్నాయి. కీలక రోజుల్లో అది మరింత ఎక్కువగా ఉంటోంది. అంత ధరను భరించే పరిస్థితి లేనివారు దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వైపే చేస్తున్నారు.  

ఆ క్లోన్‌ రైలును పునరుద్ధరించాలి 
కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే దిక్కు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో పనిచేస్తున్న బీహార్‌ వలస కూలీలు కూడా ఈ రైలు మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్‌ రైలు నడిపేవారు. అంటే అదే మా­ర్గంలో అరగంట తేడాతో నడిచే మరో రైలు అన్న­మాట. ముందు రైలుకుఉన్న ఫ్రీ సిగ్నల్‌ క్లియ రెన్స్‌ సమయంలోనే ఈ క్లోన్‌ రైలు నడుస్తుంది. కోవి డ్‌ ఆంక్షల సమయంలో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్ధరించలేదు. అది రద్దీ మార్గం కావటం, దా నికి తగ్గ అదనపు లైన్లు లేకపోవటం, ఉన్న అవకాశాలను ఇతర జోన్లు వినియోగించుకుంటుండటమే దీనికి కారణమని స్థానిక రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన మన క్లోన్‌ రైలును వేరే రాష్ట్రం ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా రైల్వే బోర్డుపై ఒత్తిడితెచ్చి ఆ క్లోన్‌ రైలును పునరుద్ధరిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top