Sakshi News home page

DA For TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2% 

Published Mon, Mar 25 2024 6:23 AM

DA for RTC employees is 43 percent: Telangana - Sakshi

వేతన సవరణ ప్రక్రియలో భాగంగా ఖరారు

హెచ్‌ఆర్‌ఏ కోతతో నిరాశలో ఉన్న ఉద్యోగులకు ఊరట

సాక్షి, హైదరాబాద్‌: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటిఅద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్‌ఆర్‌ఏ భారీగా తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్‌ఆర్‌ఏలో కోత వల్ల, కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో.. ఆ వెలితి కొంత తీరినట్టేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్‌ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్‌ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి.

కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్‌ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది.

Advertisement

What’s your opinion

Advertisement