‘కరువు’ సాగు!  | Sakshi
Sakshi News home page

‘కరువు’ సాగు! 

Published Sun, Mar 24 2024 1:39 AM

Crops Drying Due To Lack Of Irrigation Water: telangana - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు 

ఇటు కాలువల కింద అందని సాగునీరు.. 

అటు భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న బోర్లు 

నీళ్లు లేక, ఎండ తీవ్రత పెరిగి.. మాడిపోతున్న పంటలు

ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఎండిన వరి.. మిగతా పంటలకూ దెబ్బ 

ఈ సీజన్‌లో గణనీయంగా తగ్గిన సాగు.. అందులోనూ 30 శాతం దాకా ఎండిపోయిన దుస్థితి 

పలుచోట్ల పంటలను తగలబెడుతున్న రైతులు.. మరికొన్ని చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి 

ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు 

కనీసం రైతులకు భరోసా కల్పించే ప్రయత్నమూ లేదని మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. 

మూడో వంతు పంటలకు దెబ్బ 
వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్‌లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. 

అడుగంటిన భూగర్భ జలాలు.. 
గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్‌ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్‌ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. 

తగ్గిన పంటల సాగు విస్తీర్ణం 
సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. 

ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? 
ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. 

మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! 
► ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. 

► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్‌ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్‌ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. 

► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. 

పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది 
నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. 
– చిన్నయ్య, రైతు, గాధిర్యాల్‌ గ్రామం, మహమ్మదాబాద్‌ మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా 


 
ప్రభుత్వం ఆదుకోవాలి 
నందిగామ బ్రాంచి కెనాల్‌ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా 
 
నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది 
నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన.  – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్‌ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా 
 
రెండు బోర్లూ అడుగంటాయి 
రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్‌రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా 

Advertisement
 
Advertisement
 
Advertisement