ఉరిమేసి... కుమ్మేసి | Sakshi
Sakshi News home page

ఉరిమేసి... కుమ్మేసి

Published Wed, Apr 26 2023 3:41 AM

Crop damage with Heavy Rain In Hyderabad And All Over Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్,  నెట్‌వర్క్‌: హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, భారీ  ఈదురుగాలులతో కూడిన వర్షం మంగళవారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ వాగుల్లా మారాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, పలు బస్తీలు జలమయమయ్యాయి. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వరద కాలువల్లా మారిన రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.

పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 150 ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. భీకర గాలులకు హుస్సేన్‌సాగర్‌లో భాగమతి బోటు అదుపు తప్పింది. రాత్రి 9 గంటల వరకు రాంచంద్రాపురంలో 7.9 సె.మీ., గచ్చిబౌలిలో 7.7 సె.మీ., గాజులరామారంలో 6 సె.మీ. వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వడగండ్ల వాన కురిసింది. పంటలకు నష్టం వాటిల్లింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. కాగా బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

ఉక్కపోత..కుండపోత 
మంగళవారం సాయంత్రం వరకు వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాతవారణంలో మార్పులతో కొంత ఉపశమనం పొందారు. వాతావరణం చల్లగా మారిన కొద్దిసేపటికే వర్షం మొదలై ఊపందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడయ్యాయి. దీంతో వాతవారణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. కాగా రాంచంద్రాపురం, గచ్చిబౌలిలో భారీ వర్షపాతం నమోదైంది.  

పంజాగుట్ట, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, చార్మినార్, ఖైరతాబాద్, పటాన్‌చెరు, మల్కాజిగిరి, అల్వాల్, నేరేడ్‌మేట్, ముసాపేట, ఈసీఐఎల్, బాలనగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఉప్పల్‌ పరిధిలో, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కీసరలో ఈదురుగాలులతో రహదారుల వెంట ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఎస్‌పీఆర్‌ హిల్స్‌లోని ఒక దేవాలయంలో గల మహావృక్షం నేలకూలడంతో చుట్టు పక్కల ఇళ్ల గోడలు కూలాయి. దీంతో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్‌లలో ప్రధాన రహదారులు వాగుల్ని తలపించాయి. 

అదుపు తప్పిన భాగమతి 
లుంబినీ పార్క్‌ నుంచి సందర్శకులను ఎక్కించుకుని హుస్సేన్‌సాగర్‌లో విహారానికి బయలుదేరిన భాగమతి బోటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. బోట్స్‌ క్లబ్‌ వైపునకు వెళ్లింది. బోటులోని సిబ్బంది సమాచారంతో స్పీడ్‌ బోట్లలో వచ్చిన ఇతర సిబ్బంది భాగమతి వద్దకు చేరుకుని తాళ్ల సాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భాగమతిలో ఒకేసారి 150 మంది వరకు ప్రయాణించవచ్చు.  

పలు జిల్లాల్లో వానలు..పంటలకు నష్టం 
మంగళవారం ఆదిలాబాద్, జనగామ, నల్లగొండ, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్యాలలో 8 సె.మీ, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో 7 సెం.మీ, గంగాధరలో 5 సె.మీ, జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో 5 సె.మీ వర్షపాతం నమోదయ్యింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలైన వడగళ్ల వాన సుమారు 45 నిమిషాల పాటు ఏకధాటిగా కురిసింది. పలు మండలాల్లో జొన్న, నువ్వులు, వేరుశనగ, కూరగాయల పంటలు నేలకొరిగాయి.  

నిర్మల్‌ జిల్లాలో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. సారంగపూర్‌ మండలంలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. భైంసాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో విక్రయానికి తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. నిజామాబాద్‌ మార్కెట్‌లో విక్రయించడానికి రైతులు తీసుకొచ్చిన పసుపు రాశులు తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి.

మరోవైపు కామారెడ్డి జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి బచ్చన్నపేట, జనగామ, నర్మెట, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండల పరిధిలోని 25 గ్రామాల్లో 3,757 మంది రైతులకు చెందిన వరి, మామిడి, కూరగాయల పంటలకు (10,169 ఎకరాల్లో) నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది.  

నలుగురి మృతి 
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం నలుగురు మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి  గ్రామానికి చెందిన నీల పద్మ (38) చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మంగళవారం రామాయంపేటలో పండ్లు అమ్ముకొని, మరొక వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈదురుగాలులు వీయడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇదే జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన అంద్యాల పద్మ (45)పై ఇంటి రేకులు పడడంతో అక్కడికక్కడే మరణించింది.  ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ కనపర్తి విజయ్‌కుమార్‌ (38) పిడుగుపాటుకు గురై మరణించాడు. విజయ్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో కూలీకి వెళ్లేవాడు.

మంగళవారం సమీప బంధువు మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగివస్తుండగా వైరా నది సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం రాజూరా గ్రామానికి చెందిన పాతకుంట మోహన్‌ (21) కూడా మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. 

నేడు రేపూ వడగళ్ల వాన 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు కురవచ్చని హెచ్చరించింది.

దక్షిణ /ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ వైపు దిగువస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40ని డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, కొన్నిచోట్ల 35ని డిగ్రీల కన్నా తక్కువగా కూడా నమోదు కావొచ్చునని తెలిపింది. 

Advertisement
 
Advertisement