కరోనా చావులు.. కాకి లెక్కలు!

More no of Covid Compensation Applications Does not tally Government Records - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా చావులు..కాకి లెక్కలను తలపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించిన ఈ గణాంకాలకు కోవిడ్‌ ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్‌లో అందుతున్న దరఖాస్తులకు అసలు పొంతన కుదరడం లేదు. ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు.

(చదవండి: వర్క్‌ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!)

బాధితులు కోవిడ్‌తో చనిపోయినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌లు, చికిత్స పొందిన ఆస్పత్రి జారీ చేసిన మెడికల్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతో వీటిలో కొన్ని తిరస్కరణకు గురవుతుండగా 90శా తానికి పైగా దరఖాస్తులు సాయానికి అర్హమైనవిగా తేలినట్లు తెలిసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టు రిపోర్ట్, ఇన్‌పేషెంట్‌ మెడికల్‌ బిల్లులు, ఛాతి ఎక్సరే, సిటీస్కాన్‌ రిపోర్టులు, వైద్యులు సిఫార్సు చేసిన మందులు, మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ నెంబర్‌ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, అర్హత పొందిన దరఖాస్తులను కలెక్టర్లకు ప్రతిపాదిస్తుండడం విశేషం.    

దాచినా..దాగని లెక్కలు 
కోవిడ్‌ మరణాలను కూడా విపత్తుల జాబితాలో చేర్చి మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందజేయాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ.50,000 చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ మేరకు బాధిత కుటుంబాలు ఆన్‌లైన్‌లో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 2,300పైగా దరఖాస్తులు అందగా, రంగారెడ్డిలో 750పైగా, మేడ్చల్‌లో 550 దరఖాస్తులు అందాయి.

దరఖాస్తుకు తుది గడువు లేకపోవడంతో అర్జీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్‌ మరణాలతో పోలిస్తే ఆన్‌లైన్‌లో కలెక్టర్లకు అందుతున్న అర్జీల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇదిలా ఉంటే వైరస్‌ సోకినట్లు బయటికి తెలిస్తే ఇంటిని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి, కుటుంబసభ్యులను వైద్య పరీక్షలు, హోం ఐసోలేషన్‌ పేరుతో ఆస్పత్రికి తరలించే ప్రమాదం ఉందని భావించి మొదట్లో చాలా మంది కుటుంబ సభ్యుల మరణాలను సాధారణ మరణాలుగా చెప్పుకున్నారు. వాస్తవానికి కోవిడ్‌తో చనిపోయినప్పటికీ..కుటుంబసభ్యులు చేసిన పొరపాటుతో ప్రస్తుతం వారంతా ప్రభుత్వ  ఆర్థిక సహాయాన్ని పొందలేకపోతున్నారు.  

(చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే చివరికి!!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top