నిమ్స్‌లో నేటినుంచి కోవాగ్జిన్‌ 3వ దశ టీకా ట్రయల్స్‌ 

Coronavirus Phase Three Covaxin Human Clinical Trials Start NIMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)తో కలిసి నగరానికి చెందిన భారత్‌ బయోటెక్స్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ దిశగా ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ శరవేగంగా జరుగుతున్నాయని నిమ్స్‌ వైద్యులు పేర్కొంటున్నారు. కోవాగ్జిన్‌ టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి రెడీ చేసేందుకు ఐసిఎంఆర్‌ కార్యచరణ ప్రణాళికలను రూపొందించినట్టు  సమాచారం.  ఇప్పటి వరకు మొదటి రెండు దశల్లో ట్రయల్స్‌ విజయవంతంగా జరిగాయి. ఆయా దశల్లో టీకా వేయించుకున్న వాలంటీర్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ చివరి  దశ టీకా ప్రయోగానికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రయిల్స్‌ని నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో ఒకటైన నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) సోమవారం నుంచి  ట్రయల్స్‌ను కొనసాగించేందుకు సమాయత్తమవుతుంది. ఈ దశలో దాదాపుగా 600 మంది వాలంటీర్లకు టీకాలు వేయనున్నామని నిమ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ వైద్య బృందం వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top