వార్‌ రూమ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా మల్లు రవి 

Congress Leader Mallu Ravi Is Main Accused In War Room Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌ కేసులో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి ప్రధాన నిందితుడిగా మారనున్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణ, నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అభియోగపత్రాలు దాఖలు చేసే సమయంలో ఇదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరోపక్క ఈ కేసులో నోటీసులు అందుకున్న మల్లు రవి బుధవారం విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మల్లు రవిని దాదాపు రెండు గంటలపాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని స్పష్టం చేసి పంపారు. వార్‌రూమ్‌ ఎపిసోడ్‌ మొదలైన నాటి నుంచి మల్లు రవి తెరపైకి వస్తున్నారు. వార్‌రూమ్‌పై దాడి, సోదాలు జరిగిన సమయంలోనూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడూ రవి స్పందించారు.

వార్‌రూమ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న తన నుంచి ముందు వాంగ్మూలం నమోదు చేయమంటూ పోలీసులకు లేఖ రాశారు. సునీల్‌ కనుగోలు విచారణ తర్వాత కేసులో మల్లు రవిని నిందితుడిగా చేర్చిన అధికారులు, ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత వస్తానంటూ సమయం కోరిన మల్లు రవి బుధవారం విచారణకు హాజరయ్యారు. తానే వార్‌రూమ్‌ ఇన్‌చార్జ్‌ అంటూ అంగీకరించిన ఆయన, అక్కడి వాళ్లు పోస్టు చేసే ప్రతి అంశంతోనూ తనకు సంబంధం ఉండదని పేర్కొన్నారని తెలిసింది.

తాము కేవలం కాన్సెప్ట్‌ మాత్రమే చెప్తామని, అక్కడి వాళ్లు దానికి అనుగుణంగా వీడియోలు, మీమ్స్‌ తయారుచేసి పోస్టు చేస్తారని వివరణ ఇచ్చారని సమాచారం. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన రవి పోలీసులు ఏ అంశంపై విచారణ చేస్తారనే సమాచారం తనకు తెలియదని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరిస్తానని అన్నారు. వార్‌ రూమ్‌ నుంచి మా పార్టీకి సంబంధించి విలువైన సమాచారాన్ని పోలీసులు తీసుకొచ్చారని ఆరోపించారు. పోలీసుల విచారణ ముగిసిన తరవాత ఆ సమాచారం తిరిగి ఇవ్వాలని కోరతానన్నారు.
చదవండి: ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top