దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా? | Congress Leader Anil Case | Sakshi
Sakshi News home page

దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?

Jul 16 2025 12:21 PM | Updated on Jul 16 2025 1:54 PM

Congress Leader Anil Case

కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం 

బర్త్‌ డే వేడుకలకు ముందు రోజే ఘటన 

శోకసంద్రంలో కుటుంబసభ్యులు 

కలకలం రేపిన కాంగ్రెస్‌ నేత హత్య

కొల్చారం(నర్సాపూర్‌): కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్‌.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్‌లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనూహ్య రీతిలో దుండగులు వెంటాడి వేటాడి కాల్పులు జరిపి అనిల్‌ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అనిల్‌ పుట్టిన రోజు ఉండటం.. ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.  

అయ్యో.. దేవుడా.. 
‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?..  దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్‌ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కదిలించింది. బర్త్‌డే వేడుకలు చేసుకుందాం..అందరం కలుసుకుందాం అని చెప్పిన అనిల్‌ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలు కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. పదిమందికి సహాయం చేసే గుణం తప్ప మా అన్న ఎవరికీ చెడు చేయలేదని, శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్‌ సోదరుడు నవీన్‌ విలపిస్తున్నాడు. పోలీస్‌ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

గ్రామంలో విషాదఛాయలు  
అనిల్‌ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు మాత్రం తను మా కుమారుడు ఎవరికి హాని తలపెట్టింది లేదని, కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ విలపిస్తున్నారు. అనిల్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులతోపాటు వివిధ పారీ్టలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఫోన్‌ మాట్లాడిన 15 నిమిషాలకే.. 
ఫోన్‌లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్‌ అయ్యిందన్న వార్త అందిందని  కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాం«దీభవన్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్‌పల్లి మెట్రోస్టేషన్‌ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్‌ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్‌కు యాక్సిడెంట్‌ అయిందని ఫోన్‌ వచ్చిందని వివరించారు.  

క్లూస్‌టీం ఆధారాల సేకరణ 
ఘటనా స్థలిని ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి సందర్శించారు. క్లూస్‌ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement