ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు | Congress has done nothing new in Aarogyasri says harish rao | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

Mar 27 2026 3:41 AM | Updated on Mar 27 2026 3:41 AM

Congress has done nothing new in Aarogyasri says harish rao

ఆ ప్రభుత్వం వచ్చాకే బకాయిలు పెరిగాయి 

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు విమర్శించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. గురువారం శాసనసభ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 జూన్‌ 2వ తేదీన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుండగా, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరిందని చెప్పారు.

ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోందని, దీన్నిబట్టి చూస్తే ఆరోగ్యశ్రీపై చేస్తున్న ఖర్చులో సహజ పెరుగుదల మాత్రమే ఉందని, కొత్తగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు బకాయిలు పెరిగాయన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, సీఎంఆర్‌ఎఫ్‌ విషయంలో వాస్తవాలు వివరించేందుకు తమకు సభలో అనుమతి ఇవ్వడం లేదని హరీశ్‌రావు అన్నారు. 

వాయిదా తీర్మానాలు తిరస్కరణ 
రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తిరస్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లోలో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీపై చర్చించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. 

రాష్ట్రంలో యువత డ్రగ్స్‌ బారిన పడటంపై చర్చించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌ స్కీమ్, జవహర్‌లాల్‌ హౌసింగ్‌ సొసైటీ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వా యిదా తీర్మానం ఇచ్చారు. వీటన్నిటినీ స్పీకర్‌ తిరస్కరించారు. ఈ మేరకు సభలో ప్రకటన చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement