కొరడా ఝుళిపించిన కలెక్టర్‌.. డీపీఆర్‌ఓపై చర్యలు

Collector Action sought against DPRO In Nalgonda - Sakshi

సాక్షి, యాదాద్రి(నల్లగొండ): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి పద్మపై కలెక్టర్‌ పమేలా కొరడా ఝుళిపించారు. హెచ్చరిస్తున్నా అలసత్వం వీడకపోవడంతో గురువారం ఆమెను సమాచార శాఖ (ఐఆండ్‌ పీఆర్‌) కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్‌ బాధ్యతలు తీసుకున్న తొలిరోజునుంచే సీరియస్‌గా దృష్టి సారించారు. వారం రోజులు గడుస్తున్నా కొందరిలో  మార్పు రాకపోవడాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా డీపీఆర్‌ఓపై తొలి వేటు వేశారు.   

జిల్లా యంత్రాంగంలో దడ
జిల్లాలో పని చేస్తున్న ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల వరకు చాలామంది స్థానికంగా నివాసం ఉండ డం లేదు. ఇతర జిల్లాల నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టాగానే ఈ విషయంపై దృష్టి సారించారు. తొలిరోజే అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే స్థానికంగా నివాసం ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, నాల్గో తరగతి ఉద్యోగుల్లో స్థానికంగా నివాసం ఉండనివారి వివరాలనుసేకరించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చిపోతున్న అధికా రులను గుర్తించారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలస్థాయి అధికారులు, సిబ్బంది సమయపాల న పాటించకుండా రాకపోకలు సాగించడం, ప్రజల కు అందుబాటులో ఉండకపోవడంతో చక్కదిద్దాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 12గంటల వరకు విధులకు హాజరుకాకపోవడం, మధ్యాహ్నం 3 కాగానే వెళ్లిపోయే వారందరి వివరాలను సేకరించినట్లు తెలిసింది.  

మరికొందరిపైనా వేటు పడనుందా?
డీపీఆర్‌ఓను సరెండర్‌ చేయడం ద్వారా నిర్లక్ష్యం వహించే ఉద్యోగుల విషయంలో తన వైఖరి ఏమిటో కలెక్టర్‌ చెప్పకనేచెప్పారు. ఇప్పటికే సుమారు ఐదుగురి వివరాలను సేకరించి వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, స్థానికంగా ఉండకపోవడం, సమాచారం లేకుండా జిల్లాను విడిచివెళ్తున్న వారిపై నిఘా ఉంచారు. వర్షాకాలం కావడంతో వరదలు వచ్చిన సమయంలో అధికారులు స్థానికంగా లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆమె ఇప్పటికే సమావేశంలో వివరించారు. దీంతోపాటు పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల్లో మొక్కుబడిగా కాకుండా పక్కాగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మార్పురానివారు ఎంత టి వ్యక్తులైనా సరే చర్యలు తప్పవని.. డీపీఆర్‌ఓ అ టాచ్‌తో చెప్పకనే చెప్పిందని అధికార వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

నిర్లక్ష్యానికి మూల్యం!
సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటన, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి ఆలయ పనుల పరి శీలన, వాసాలమర్రిలో గ్రామసభ, సహపంక్తి భోజనం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఉండగా డీపీఆర్‌ఓ అందుబాటులో లేకుండాపోయారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కలెక్టర్‌ నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే మూడు రోజులు సెలవుపై వెళ్లారు. తన సి బ్బంది ద్వారా కలెక్టర్‌ చాంబర్‌లో విధులు నిర్వహించే ఉద్యోగికి సెలవు పత్రం అందజేసి వెళ్లారు. చీఫ్‌ జస్టిస్, ముఖ్యమంత్రి పర్యటనకోసం వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నా సమాచార శాఖ పరంగా నిర్వర్తించాల్సిన విధులను నిర్లక్ష్యం చేశారని కలెక్టర్‌ ఆగ్రహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గురువారం విధులకు హాజరైన డీపీఆర్‌ఓ పద్మకు.. కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను సిబ్బంది అందజేశారు. దీంతో ఆమె తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top