శంకర్‌గౌడ్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Shocked On Death Of RTC Driver Shankar Goud | Sakshi
Sakshi News home page

శంకర్‌గౌడ్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

Apr 24 2026 7:18 AM | Updated on Apr 24 2026 8:37 AM

CM Revanth Reddy Shocked On Death Of RTC Driver Shankar Goud

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

కాగా, వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతు మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement