
నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చిన ఘనత ఆయనదే
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుటుంబానికి అండగా గాంధీ కుటుంబం
ఆర్డీఆర్ సంతాప సభలో సీఎం రేవంత్‌రెడ్డి
తుంగతుర్తి, తిరుమలగిరి: ‘ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చిన ఘనత రాంరెడ్డి దామోద్‌రెడ్డిది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి ఎస్సారెస్పీ స్టేజ్–2 సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఎస్సారెస్పీ స్టేజ్–2 కాలువకు నీళ్లు తెచ్చారు. అందుకే ఎస్సారెస్పీ స్టేజ్–2 కాలువకు ‘ఆర్డీఆర్ ఎస్సారెస్పీ–2 కాలువ’గా నామకరణం చేసున్నాం. దీనికి సంబంధించి 24 గంటల్లోó జీవో విడుదల చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లేని లోటు తీర్చలేదని, ఎస్సారెస్పీ–2కు ఆర్డీఆర్ పేరు పెట్టడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభలో రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి హాజరయ్యారు.
గోదావరి జలాల కోసం పోరాటం
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చారని, నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తేవడానికి దామోదర్‌రెడ్డి ఎనలేని పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని తీసుకొచ్చి రక్తతర్పణం చేశారని గుర్తుచేశారు. ఐదుసార్లు శాసన సభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలిచారని కొనియాడారు.
ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ జిల్లాలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జోడెడ్లలాగా పార్టీని తమ భుజాలపై మోసినట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దామోదర్‌రెడ్డి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్‌లో దామోదర్‌రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించి కాపాడుకుంటామని రేవంత్‌రెడ్డి చెప్పారు. సోనియాగాం««దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జునఖర్గేకు దామోదర్‌రెడ్డిపై అభిమానం ఉందన్నారు.
రాహుల్‌గాంధీ తన సంతాపాన్ని స్వయంగా లేఖ ద్వారా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డికి పంపారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రాంచందర్‌నాయక్, ఎంపీ రఘువీర్‌రెడ్డి, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, పద్మావతి, వేముల వీరేశం, బాలునాయక్, మట్టా రాఘమయి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.