పామాయిల్ ఫ్యాక్టరీ నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో రఘునందన్‌రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్, సంజీవ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ తదితరులు
సిద్దిపేట జిల్లా నర్మెట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమంలో వెనుకంజ వేయం
ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి
పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది
బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే
తొలివిడత రైతుభరోసా నిధులు విడుదల చేసిన సీఎం
నేడు రైతుల ఖాతాల్లో జమవుతాయని వెల్లడి
పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం.. రైతులకు అంకితం
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సాక్షి, సిద్దిపేట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతుభరోసా కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. తొలి విడత పెట్టుబడి సాయం కింద సీఎం నిధులు విడుదల చేశారు.
ఆదివారం సెలవు కావడంతో సోమవారం
అన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఫ్యాక్టరీని రైతులకు అంకితమిచ్చారు. అలాగే రూ 475.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు మహోత్సవాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..
‘రాష్ట్రంలో 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. అయితే రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తృణధాన్యాలు (మిల్లెట్స్), ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్‌లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వ్యవసాయం చేయడం తెలుసు. చీడపీడలకు ఏ మందు వేయాలో కూడా తెలుసు..’ అని సీఎం చెప్పారు.
అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలి
‘నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని 12,728 గ్రామాల్లోని రైతులంతా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా పంటలను ఎగుమతి చేసే దిశగా కృషి చేస్తోంది. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. గతంలో 114 నెలల్లో కేసీఆర్ సగటున ఒక్కో నెలకు రూ2,535 కోట్లు ఖర్చు చేస్తే 28 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున నెలకు రూ 5,,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. తాజాగా రైతు భరోసా తొలి విడత విడుదల చేశాం. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తాం.
యూరియా కొరత వచ్చేలా ఉంది..
పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా, ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు సహకరించాలి.
సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి
వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాం. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబానికి చెందిన వారినే ఎమ్మెల్యేను చేశారు. మార్చి చూడండి మంచి జరుగుతుంది. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లకు అప్పగిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రత్యర్థి పార్టీ నియోజకవర్గమనే వివక్ష ఉండదు..
‘ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపను. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత పాలకులు ఈ విధంగా విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. కానీ నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తాం. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని కొడంగల్‌కే తీసుకెళ్లేవాడిని. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ కూడా పాల్గొని తన నియోజక వర్గం పరిధిలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. ‘ప్రైవేట్ పాఠశాలల మోజులకు పోకండి.. ఆర్థికంగా నష్టపోకండి.. ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తున్నాం. అందుకే ఆ శాఖ నాదగ్గరే ఉంచుకున్నా..’ అని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: మంత్రి తుమ్మల
సిద్దిపేటజోన్/నంగునూరు(సిద్దిపేట): రైతు సంక్షేమ ప«థకాలను అమలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని, అవసరమైతే ప్రత్యేకంగా నిధుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివేక్ తెలిపారు.
ప్రకృతి పరంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని ఆయిల్‌పామ్ సాగుతో బోలెడు ఆదాయం పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ఉందని, పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీనీ కచి్చతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతిగా దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు.


