
సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ
విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత
పరిశీలనకు టెక్నాలజీని వినియోగించుకోవాలి
పుస్తకాలు యూనిఫామ్ పిల్లలకు
చేరుతున్నాయో, లేదో ధ్రువీకరించుకోవాలి
హాస్టళ్లను సమీప టీచింగ్ ఆస్పత్రులకు అటాచ్ చేయాలి.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి
సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
గ్రీన్ చానల్ ద్వారా డిమాండ్‌కు తగినన్ని నిధులు విడుదల
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరు కూ డా ఇదే విధానంలో స్వీకరించాలన్నారు. ఈమేరకు హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలన్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఆహారంతో విద్యార్థులకు లభించే కేలరీలను తెలుసుకోవాలని చెప్పారు.
హాస్టళ్ల సమాచారం డాష్‌బోర్డులో...
హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలన్నారు. ‘హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను సంక్షేమ హాస్టళ్లతో అనుసంధానించాలి.
హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. 24 గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించాలి’అని రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్íÙప్‌లు, సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను సీఎం ఆదేశించారు.
మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయండి
హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిధుల విడుదల కోసం ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, అవసరమైన యాప్‌లను రూపొందించాలని నిర్దేశించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి కింద సంక్షేమ విద్యాసంస్థలకు రూ.60 కోట్లు ప్రత్యేకంగా కేటాయించగా... ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందించారు. ఈ నిధులను హాస్టళ్లలో మరమ్మతులు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.