ఎప్పుడొచ్చారు.. ఇప్పుడెలా ఉంది? : సీఎం కేసీఆర్‌ పరామర్శ

CM KCR Visits Warangal MGM Hospital - Sakshi

ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బాధితులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

మందులు, భోజనం సరిగా ఇస్తున్నారా.. 

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి

20 మందికిపైగా బాధితులతో మాటామంతీ..

45 నిమిషాల పాటు ఆస్పత్రిలో.. ఐసీయూ, వార్డుల పరిశీలన

తర్వాత వరంగల్‌ జైలు సందర్శన

ఓరుగల్లు కలెక్టరేట్‌ నుంచే అన్ని జిల్లాల కలెక్టర్లతో కరోనాపై సమీక్ష

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘‘ఏమ్మా బాగున్నవా.. ఆరోగ్యం ఎట్లుంది.. ఏ ఊరే పెద్దమనిషి.. ఎప్పుడొచ్చారు.. భోజనం మంచిగ పెడ్తున్నరా.. గోలీలు మంచిగ ఇస్తున్నరా..’’ అంటూ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరామర్శిం చారు. పేషెంట్లు చికిత్స పొందుతున్న బెడ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, టైం ప్రకారం మందులు, గోలీలు ఇస్తున్నరా అని అడిగి తెలుసుకున్నారు. ‘‘డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటరు. ఆరోగ్యం మంచిగ కాగానే ఇంటికి పంపిస్తరు. ఏం ఫికర్‌ పడొద్దు. అండగా నేనున్నా..’’ అంటూ బాధితుల్లో మనో ధైర్యం నింపారు. కరోనా బాధితులు, ఇతర రోగులకు చికిత్సకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని.. అందరికీ మంచి చికిత్స అందించాలని వైద్యులు, ఇతర సిబ్బందిని ఆదేశించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. వార్డులన్నీ కలియదిరిగి, బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. తర్వాత ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడెసివిర్, ఇతర మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో మాట్లాడి.. వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న సేవలను అభినందించారు.

బాధితుడిని తేలిక పరుస్తూ..
సీఎం: మీదే ఊరు, పేరేంటిది పెద్దమనిషి?
వెంకటాచారి: సార్‌.. వెంకటాచారి సార్‌... మట్టెవాడ
సీఎం: ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడికీ
వెంకటాచారి: పన్నెండు 
రోజులైతంది సారు...
సీఎం:ఇప్పుడెలా ఉంది... 
వెంకటాచారి: మంచిగనే ఉన్నది సారు.. గోలీలు ఇస్తున్నరు... భోజనం పెడుతున్నరు
సీఎం: మందులు వాడుతా ఉండూ.. తొందరగానే 
తగ్గుతుంది...
(సీఎం కేసీఆర్‌ పరామర్శ అనంతరం ఆ వృద్ధుడు వెంకటాచారి ఆనందంతో ‘కేసీఆర్‌ జిందాబాద్‌.. కేసీఆర్‌ నా రెండో ప్రాణం’ అంటూ నినాదాలు చేశారు.)

సెంట్రల్‌ జైల్లో ఖైదీలతో మాట్లాడిన సీఎం..
ఎంజీఎం సందర్శన తర్వాత.. అక్కడికి సమీపంలో ఉన్న సెంట్రల్‌ జైలును కేసీఆర్‌ సందర్శిం చారు. బ్యారక్‌లు, ఓపెన్‌ జైలు, నర్సరీలలో కలియతిరి గారు. ఖైదీలతో మాట్లాడారు. ఏ నేరంపై వచ్చారు, ఏ ఊరు, కుటుంబ పరిస్థితి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు. అభ్యర్థనలను స్వీకరించారు. జైలు లోపల ఉన్న ఫినాయిల్, సోప్, స్టీల్‌ ఫర్నిచర్, ప్రింటింగ్‌ ప్రెస్, చేనేత వస్త్రాల తయారీ యూనిట్లను, ఖైదీలు తయారుచేస్తున్న శానిటైజర్, మాస్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులతో సీఎం మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిగా మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చనున్నామని.. సెంట్రల్‌ జైలును మరోచోటికి తరలించి, ఈ ప్రదేశంలో అన్ని చికిత్సలు, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించే మెడికల్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నూతన జైలు నిర్మాణానికి ఎంత భూమి అవసర మని సీఎం అడగ్గా.. 130 ఎకరాల వరకు కావాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు సైతం 130 ఎకరాల్లో ఉందని, వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు మహా పరివర్తన, ఉన్నతి తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఖైదీలకు ఉపాధి కల్పించే కర్మాగారాలు, తీవ్రవాదులను ఉంచే హైసెక్యూరిటీ బ్యారక్స్, ఓపెన్‌ జైలు వంటి వాటికోసం కలిపి కనీసం 100 ఎకరాలకుపైన భూమి అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.


కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి తదితరులు 

ధాన్యం సేకరణ వేగిరం చేయండి
కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తాను హెలికాప్టర్‌లో వస్తుండగా రోడ్లమీద వడ్ల కుప్పలు కనిపించాయని చెప్పారు. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో పడతారని, అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఉన్నతాధికారులు ఉన్నారు.

కఠినంగా లాక్‌డౌన్‌ అమలు
ఆస్పత్రి, జైలు సందర్శన తర్వాత సీఎం కేసీఆర్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం పేరుపేరునా పలకరించి మాట్లాడారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటని అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ‘‘రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీ, కలెక్టర్లపై ఉంది. ఉదయం సడలింపు ఇచ్చిన నాలుగు గంటలు మినహా.. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చెయ్యాలె. అలసత్వం వహించకూడదు.  ఉదయం 10గంటల 10 నిమిషాల తర్వాత పాస్‌ హోల్డర్స్, అత్యవసర సేవల వారు తప్ప మరెవరూ రోడ్డు మీద కనిపించకుండా చర్యలు చేపట్టాలి. సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు. కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ సరిగా అమలు జరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచైనా కఠినంగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అమలు చేయిస్తున్నారని.. నగరాల్లో, పట్టణాల్లో మాత్రం పకడ్బందీగా అమలు కావాల్సి ఉందని చెప్పారు. దీనిపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు.


ఎంజీఎంలో యాదమ్మతో.. 

ధైర్యంగా ఉండు
సీఎం కేసీఆర్‌: అమ్మా.. మీ పేరేంటి?
యాదమ్మ: యాదమ్మ సార్‌
ఏ ఊరమ్మ... ఎక్కడి నుంచి వచ్చారు?
సార్‌ మాది రంగశాయిపేట.. 
ఇక్కడ్నే వరంగల్‌లో..
ఇప్పుడెలా ఉంది.. మంచిగనే ఉందిగదా!
సార్‌ ఇప్పుడు మంచిగనే ఉంది.. పూర్తిగా మంచిగైతే ఇంటికి పోదామని సూత్తన్న
భోజనం, గోలీలు మంచిగ ఇస్తున్నరా..?
మంచిగనే ఇస్తున్నరు. తొందరగ నయమైతే బాగుండనిపిస్తుంది
మీకేమీ కాదు.. ధైర్యంగా ఉండు.. అండగా నేనుంటా

సార్‌.. మీరు చల్లగుండాలె..
కరోనాకు చికిత్స పొందుతున్న 68 ఏళ్ల వృద్ధురాలి వద్దకు కేసీఆర్‌ వెళ్లగానే ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ‘‘సార్‌ మిమ్మల్ని చూసి చాన్నాళ్లయింది. మీరిక్కడికి రావడం, మిమ్ములను చూడటం సంతోషంగా ఉందయ్యా. మీరు చల్లగా ఉండాలె..’’ అని సంతోషపడ్డారు.

సీఎం పర్యటన సాగిందిలా..
కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు, పలు ఇతర కార్యక్రమాల కోసం సీఎం కేసీఆర్‌ శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానానికి వచ్చా రు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యా హ్నం 12.40 గంటలకు ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. డబుల్‌ మాస్క్, ఫేస్‌ షీల్డ్‌ ధరించి 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో కలియదిరిగారు. ఐసీయూ, వార్డులను సందర్శించారు. కోవిడ్‌ బాధితులు, ఇతర పేషెంట్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. తర్వాత సమీపంలోని సెంట్రల్‌ జైలును పరిశీలించా రు. ఖైదీలు, జైలు అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top