బీజేపీని పారదోలాలి..మోదీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు: సీఎం కేసీఆర్‌ | CM KCR Sensational Comments On Central Govt In Press Meet | Sakshi
Sakshi News home page

బీజేపీని పారదోలాలి..మోదీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు: సీఎం కేసీఆర్‌

Nov 30 2021 1:41 AM | Updated on Nov 30 2021 10:44 AM

CM KCR Sensational Comments On Central Govt In Press Meet - Sakshi

బీజేపీ నేతలు కల్లాల దగ్గర డ్రామా ఆడుతున్నరు. వరి వేయొద్దని రాష్ట్ర వ్యవసాయ మంత్రి చెప్తే.. తొడలు, మెడలు వంచి కొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. ఇదేమిటని కేంద్ర మంత్రులను అడిగితే.. ‘మావాడు బేవకూఫ్‌’అని వాళ్లే చెప్తున్నరు. ఈ బురిడీ గాళ్లను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పడతం. కేంద్రానిది దిక్కుమాలిన పాలసీ. ఆ చేతగానితనాన్ని మంది మీద రుద్దుతరా? దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధాని దేశ రైతాంగానికి ఎందుకు క్షమాపణ చెప్పాడు. మీది 750మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ. రాబందుల పార్టీ. వాళ్లు జనాన్ని ముంచేటోళ్లు, మేలు చేసేవాళ్లు కాదు. 
 – ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘దేశంలో రైతులు బాగుపడాలంటే ఈ దుర్మార్గ బీజేపీ పాలన పోవాలి. ఆ పార్టీని దేశం నుంచే పారదోలాలి. ఎన్ని రోజులు మోసం చేస్తరు? బీజేపీ ఏడేళ్ల పాలనలో రూ.80 లక్షల కోట్ల అప్పులు చేశారు. మొత్తం అప్పులు 1.30 కోట్ల కోట్లకు చేరాయి. మోదీ ప్రభుత్వం పేదరికాన్ని పెంచి రైతు ఆత్మహత్యలకు కారణమైంది. సాగు చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నరు. అనేక మతాలు, సమాజాలు కలిసి బతుకుతున్న దేశంలో సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాగే వదిలేస్తే మతపిచ్చి రేపి విభజన రాజకీయాలతో దేశాన్ని రావణ కాష్టం చేస్తరు’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

కేంద్ర మంత్రి చేతకాని దద్దమ్మ
‘‘కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి మంత్రి ఉంటే సంతోషపడతారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ వస్తుందని చెప్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సిపాయి. కానీ కొనం అని చెప్పే రండ కేంద్రమంత్రి కావాల్న తెలంగాణకు? చేతగాని దద్దమ్మ! ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. రైతులు 13 నెలలపాటు ఎండలో, వానలో, కరోనా మధ్య పోరాటం చేస్తే.. కొట్టి చంపాలని హర్యానా సీఎం చెప్తారు. కార్లెక్కించి రైతులను చంపి చివరకు క్షమాపణ చెప్పింది మీరు. మేం రైతు బంధువులం. క్రూడాయిల్‌ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచింది మోదీ ప్రభుత్వం. మీరు పెంచుతరు.. మేం తగ్గించాలని ధర్నా చేస్తారా? ఇజ్జత్‌ మానం ఉందా?  

ఏ చౌరస్తాకు వస్తవో రా.. 
కిషన్‌రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలె. ధాన్యం కొనుగోళ్లపై ఏ చౌరస్తాకు చర్చకు వస్తవో చెప్పు. మీ పార్టీ వేదికల్లో ఈ అంశం మీద మాట్లాడే దమ్ము, మగతనం లేదు. కేసీఆర్‌ షంటుతున్నడని చెప్పు. కిషన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కాకుండా చెత్తమాటలు మాట్లాడుతూ.. హుజూరాబాద్, గజ్వేల్, దుబ్బాక అంటూ ఏదేదో అంటున్నడు. ధాన్యం కొనుగోళ్లపై పచ్చి అబద్ధాలతో దివాళాకోరు రాజకీయం చేస్తున్నరు. మీరు ధాన్యం కొంటామంటే మేం వద్దంటున్నమా? రైతులు పంట పండించి ఆత్మహత్యలు చేసుకోవాలా? అగ్రికల్చర్‌ పాలసీ తోక కూడా కూడా కిషన్‌రెడ్డికి తెలియదు.  

తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలె 
రైతుల బాధలు చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు వెళితే కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌ ‘మీకు వేరే పనిలేదా?’అంటున్నారు. వరిసాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం పచ్చి అబద్ధాలు చె ప్పింది. నాసిరకం విత్తనాల విషయంలో పీడీ చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాసిరకం విత్తనాలపై కిషన్‌రెడ్డికి ఏం తెలుసు. కేంద్రంలో ఆయనను దేకను కూడా దేకరు. హీనంగా చూస్తరు. పెద్ద నోరు తో మాట్లాడితే సరిపోతుందా? గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మనం నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ కంటే దిగువన 101వ స్థానంలో ఉన్నాం. సిగ్గు, లజ్జ ఉంటే గోయల్, కిషన్‌రెడ్డి కళ్లు తెరవాలి. రేపు తెలంగాణ రైతులకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి. 

ఒక్కో పల్లెలో కోట్ల రూపాయలు 
తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని బుట్టచోర్‌గాళ్లు, దరిద్రులు అన్నారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ మూడెకరాలు కొంటే.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మి ప్రకా శం జిల్లాలో ఐదు ఎకరాలు కొంటున్నారు. ఒక్కో పల్లెలో కోట్లాది రూపాయలు ఉంటున్నాయి.

మేధావులు ఆలోచించాలె 
ఆర్థికంగా నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న తెలంగాణలో సామాజిక వాతావరణం దెబ్బతినకుండా మేధావులు ఆలోచించాలి. రేపు పొద్దున మత కలహాలు మొదలై.. కర్ఫ్యూలు, లాఠీచార్జీలు, ఫైరింగ్‌లు పెడితే ఈ పరిస్థితి ఉంటదా? బీజేపీని అంగీకరించి తెలంగాణ, హైదరాబాద్‌ వాతావరణాన్ని దెబ్బతీసుకుందామా? వీళ్లను నమ్మితే సర్వనాశనమే. వారిపై ఎందాకైనా, ఏది అడ్డువచ్చినా పోరాడుతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement