ఉత్తరాదిన జై కిసాన్‌.. పక్కా ప్లాన్‌ రెడీ చేసుకున్న సీఎం కేసీఆర్‌!

Cm Kcr Plans To Enter National Politics Hyderabad - Sakshi

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం,బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా కార్యాచరణ 

గుజరాత్‌లోనూ రైతు సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు 

 మరిన్ని రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం 

తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికి పరిచయం 

రైతు సంఘాలు, భావసారూప్య పార్టీలకు భాగస్వామ్యం 

బీజేపీ వ్యతిరేక పార్టీలు, నేతలతో కొనసాగనున్న సంప్రదింపులు 

ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సదస్సుకు యోచన

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికి కొంతకాలంగా పునాది వేసుకుంటూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో రెండురోజుల పాటు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారితో విస్తృతంగా చర్చలు జరపడంతో పాటు తెలంగాణ వ్యవసాయ విధానాన్ని వివరించిన కేసీఆర్‌.. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని రైతు సంఘాలు, భావసారూప్య రాజకీయ పార్టీలకు సదస్సుల్లో భాగస్వామ్యం కల్పించాలనే యోచనలో ఉన్నారు.  

చెక్కులు పంపిణీ.. 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేసీఆర్‌.. ఈ మేరకు గత మే నెలలో చండీగఢ్‌లో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఇదే తరహాలో త్వరలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే రైతు సదస్సుల్లోనూ పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అదే సమయంలో తెలంగాణ వ్యవసాయ విధానాన్ని వివరిస్తారు. రైతు సదస్సుల నిర్వహణ, షెడ్యూల్‌ ఖరారు, రైతు సంఘాలతో సమన్వయ బాధ్యతలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు.  

జాతీయ పార్టీపై ఆచితూచి.. 
వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గతంలో ప్రకటించిన తరహాలో కాకుండా జాతీయ పార్టీ ఏర్పాటుపై కొంత ఆచితూచి వ్యవహరించాలనే ధోరణిలో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు, నేతలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు.

అందులో భాగంగానే కేసీఆర్‌ బుధవారం బిహార్‌ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. వాస్తవానికి మే 29, 30 తేదీల్లోనే బిహార్, పశ్చిమ బెంగాల్‌ పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించిన సీఎం.. చివరి నిమిషంలో రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీల ముఖ్యమంత్రులు, నేతలతో త్వరలో జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బిహార్‌ సీఎం నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో జరిగే భేటీలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు ఈ సదస్సు నిర్వహణపై చర్చించే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో సదస్సు ఉండే అవకాశమున్నట్లు తెలిసింది. 

రాష్ట్రంలో బీజేపీ దూకుడును అడ్డుకునేలా.. 
ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ, టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ నెల 3న రాష్ట్ర కేబినెట్‌ భేటీ, సాయంత్రం పార్టీ శాసనసభ, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాలు, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్‌.. సెప్టెంబర్‌ 5న నిజామాబాద్, 10న జగిత్యాల కలెక్టరేట్‌లు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించనున్నారు. మరోవైపు 12వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ధరణి, పోడు భూముల సమస్య, ఉపాధ్యాయుల పదోన్నతులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు ఈ నెల 3న జరిగే కేబినెట్‌ భేటీ ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముందని సమాచారం.  

మళ్లీ రెవెన్యూ సదస్సులు 
ధరణి సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రకటించిన రెవెన్యూ సదస్సులు వరుస వర్షాలతో వాయిదా పడిన నేపథ్యంలో వాటిని తిరిగి ప్రారంభించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 3న జరిగే కేబినెట్‌ భేటీలో ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యేలు క్రియాశీల భాగస్వాములు కావాలని 3న వారితో జరిగే భేటీలో సీఎం ఆదేశించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు వంటి అంశాలు కూడా చర్చిస్తారు. మొత్తం మీద తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించకుండా, రాష్ట్రంలోనే కట్టడి చేయాలనే బీజేపీ వ్యూహాన్ని సమర్ధంగా తిప్పికొట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను గాడిన పెట్టడం, జాతీయ రాజకీయాలపై పట్టు సాధించడంపై ముఖ్యమంత్రి సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

 ఉత్తరాదిలో బీజేపీ ప్రభావమున్న ఏవైనా ఐదు రాష్ట్రాల్లో అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో రైతు సదస్సులు జరిగే అవకాశం ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరిగే గుజరాత్‌లోనూ ఈ తరహా సదస్సును నిర్వహించాలనే యోచనలో ఆయన ఉన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు తెలంగాణలో అమలవుతున్న మిషన్‌ భగీరథ, ఆసరా వంటి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌ రైతు సదస్సుల ప్రధాన ఎజెండాగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top