ఏపీ అక్రమ నిర్మాణాలు ఆపకుంటే..బాబ్లీ తరహా బ్యారేజీ

CM KCR Comments In APEX Council Meeting - Sakshi

అలంపూర్‌–పెద్ద మరూర్‌ వద్ద బ్యారేజీ నిర్మించి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోస్తాం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

కృష్ణా జలాల అన్యాయాన్ని సవరించాలని కేంద్రానికి వినతి

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణానదిపై పోతిరెడ్డి పాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే... తెలంగాణ ప్రభుత్వం కూడా అలం పూర్‌ –పెద్ద మరూర్‌ వద్ద (జూరాల దిగువన... శ్రీశైలం ఫోర్‌షోర్‌లో తుంగభద్ర కలవడానికి ముందు) బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయ మని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చు కోకుండా, మొండి వైఖరితో అక్రమ ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే... మహా రాష్ట్ర గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌కు ఎగువన నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగానే తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం కృష్ణాపై కొత్త బ్యారేజీ నిర్మించి నీటిని ఎత్తిపోస్తామని హెచ్చ రించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవ హరిస్తే ఇక కుదరదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

‘నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. భారత యూనియన్‌లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణకు అంతర్‌రాష్ట్ర నదీజలాల్లో న్యాయ మైన వాటాను పొందే హక్కు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగు నీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతాం’అని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ పలుమార్లు అభ్యంత రాలు వ్యక్తం చేసినా, ఈ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులు, వాటాలపై వివరించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. 

అపెక్స్‌లో కేసీఆర్‌ వాదన ఇదీ...

  • తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని కేసీఆర్‌ కోరారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే... 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956–సెక్షన్‌ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం ఇప్పటికైనా కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి కృష్ణా జలాల పునఃపంపిణీకి చొరవ చూపాలి’అని కోరారు. దీనిపై కేంద్రమంత్రి షెకావత్‌ స్పందిస్తూ... తెలంగాణ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధమే. అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్‌ వేసి ఉన్న కారణంగా ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నామని తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్, కేంద్రం గనుక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే.. సుప్రీంకోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు. 
  • ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 సెక్షన్‌ 89 కింద కృష్ణా నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడిటి–2)కు ‘టరŠమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌’ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు.
  • అంతర బేసిన్లలోనే నదీ జలాలను తరలించాలనే జల న్యాయసూత్రాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. ‘ఒక నదీ బేసిన్‌లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరినంకనే, ఇంకా అదనపు జలాలుంటేనే బేసిన్‌ అవతలికి నదీ జలాలను తరలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’అని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా /సీఎం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బేసిన్‌ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఆంధ్రప్రదేశ్‌కు లేదని, ఇదే విషయాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖతో పాటు కృష్ణా బోర్డు ఏపీకి స్పష్టం చేయడాన్ని సరైన చర్యగా సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. 
  • తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నది మీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. కాగా డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరడం పట్ల సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేననీ, ఇందులో రహస్యం ఏమీ లేదని, కాకపోతే నిర్మాణక్రమానికి అనుగుణమైన స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండటం వలన డీపీఆర్‌లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని, అంతేతప్ప డీపీఆర్‌లు ఇవ్వడానికి తమకు ఏ అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. 
  • రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. అయితే బోర్డులు సమర్ధవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. 

ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై హర్షం.. 
ఇక ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సెక్షన్‌–3 కింద ఇచ్చిన వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించడం, రాష్ట్ర ఒత్తిడి మేరకు ట్రిబ్యునల్‌ ద్వారా దీన్ని పరిష్కరిస్తామన్న హామీ ఇవ్వడం తెలంగాణకు మేలు చేకూర్చే అంశమన్నారు. తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్‌ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులందరినీ ముఖ్యమంత్రి అభినందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top