సొంతూరులో సన్మానం కిక్కేవేరు

Chief Justice Nv Ramana Felicitation Hyderabad - Sakshi

ఎన్ని శిఖరాలు అధిరోహించినా ఈ బార్‌కౌన్సిల్‌ సభ్యుడినే

హైకోర్టులో జరిగిన సన్మానంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

సాక్షి, హైదరాబాద్‌: ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అయినట్లు.. నేను ఎంత ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించినా ఈ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడినే.. న్యాయవాది రమణనే. సొంత ఊరిలో మర్యాద పొందడం అన్నది సామాన్యమైన విష యం కాదు... ఆ కిక్కే వేరు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో శుక్రవారం తెలంగాణ బార్‌ కౌన్సిల్, బార్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో చేపట్టిన సన్మానంపై ఉప్పొంగిపోయారు. గత స్మృతులను నెమరేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

గతంలో తనను రాజభవన్‌లో, వరం గల్‌లోనూ సన్మానించారని, తనను ఎంతో ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకున్న తెలంగాణ గడ్డకు కృతజ్ఞుడినని అన్నారు. తెలంగాణ హైకోర్టు తనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. భాష, మర్యాద, సంస్కా రం, సంస్కృతి, జీవితంలో పోరాటం, జీవించడం వంటివి నేర్పిందని గుర్తుచేసుకున్నారు. న్యాయ వాదిగా 17 ఏళ్లు, న్యాయమూర్తిగా 13 ఏళ్లు పని చేశానని, అందుకే ఈ ప్రాంగణంలోకి వస్తే భావోద్వేగానికి గురవుతానన్నారు. 

తెలంగాణ అభివృద్ధికి సంతోషిస్తున్నా... 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు కొంత మంది ఎక్కువ క్రమశిక్షణతో కనిపిస్తున్నారని సీజేఐ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనమన్నా రు. ఐక్యతకు చిహ్నమని, అందుకే మీరు తెలంగాణను పోరాడి తెచ్చుకోవడం సామాన్య విషయం కాదన్నారు. ఆ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించే వాడిలో తాను కూడా ఒకడినని చెప్పారు. తన పదవీకాలంలో ఏమి ఘన కార్యాలు చేసినా ఆ ఖ్యాతి తెలంగాణ హైకోర్టుదేనని, అపఖ్యాతి వస్తే మాత్రం ఆ బాధ్యత తనదన్నారు. 

కోర్టుల్లో వసతులలేమికి ఇక పరిష్కారం... 
తాను సీజేఐ అయ్యాక దేశ న్యాయ వ్యవస్థలో రెండు మౌలిక లోపాలను గమనించానని ఎన్‌వీ రమణ చెప్పారు. సామాన్యుడికి న్యాయం అందుబాటులో ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి తగిన సం ఖ్యలో కోర్టులు ఉండటం, సరైన సౌకర్యాలు ఉండ టం అవసరమన్నారు. అందుకోసమే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించానన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్రాల సీఎంలు, ప్రధాని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఈ అంశంపై చర్చిస్తామని, చర్చలు ఫలప్రదమైతే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సగం పోస్టులు భర్తీ చేశా.. 
‘దేశంలోని హైకోర్టుల్లో 1,100 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఎప్పుడూ కనీసం 400 ఖాళీలు ఉంటాయి. నేను సీజేఐ అయ్యాక 198 హైకోర్టు జడ్జీల పోస్టుల భర్తీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపా. అందులో ఇప్పటిదాకా 130 భర్తీ అవగా మిగిలినవి కేంద్రం వద్ద పెండింగ్‌లోఉన్నాయి. మే నెలాఖరులోగా మరో 200 మంది న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపుతా. తెలం గాణ హైకోర్టులో 24గా ఉన్న జడ్జీల సంఖ్యను 42కి పెంచుకున్నాం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ మరిన్ని పేర్లు పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఖాళీల భర్తీలో సామాజిక, ప్రాంతీయ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సీజేఐ సూచించారు. 

మహిళా జడ్జీల తరఫున నినదించా... 
‘ఢిల్లీలో ఇటీవల మహిళా జడ్జీలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కార్ల్‌ మార్క్స్‌ నినా దాన్ని కాస్త మార్చి చెప్పా. మహిళలారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు... సంకేళ్లు తప్ప అనే నినాదం ఇచ్చా. కానీ ఈ విషయంలో కొన్ని సామాజిక మాధ్యమాలు నాపై దుమ్మెత్తిపోశాయి. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని కోరడం తప్పు అన్నా నేనేమీ లెక్కచేయను. కేవలం మహిళలకే కాదు... అన్ని ప్రాంతాలకు సమ న్యాయం ఉండాలి. అప్పుడే న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. 

జూనియర్లకు ఆర్థిక చేయూత అందించాలి... 
‘చిన్న, మధ్యతరగతి న్యాయవాదులు కోవిడ్‌ కాలంలో ఇబ్బందులు పడ్డారు. వృత్తిని వదిలేసి చేతివృత్తులు, ఆటోలు నడుపుకోవడం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్‌ న్యాయవాదులకు సీనియర్‌ న్యాయవాదులు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నా. అలాగే జూనియర్లను న్యాయమూర్తులు కాస్త కనిపెట్టి ఉండాలి. న్యాయవాదుల శిక్షణకు అకాడమీని హైదరాబాద్‌లోనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అఖిల భారత జ్యుడీషియల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించా. అలాగే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని వినియోగించుకోవాలి’ అని సీజేఐ సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top