కంటి చూపు పరిధి దాటి ఎగరనున్న డ్రోన్లు

Centre Permits Telangana To Use Drones For Delivery of Corona Vaccines - Sakshi

వ్యాక్సిన్ల పంపిణీ కోసం కేంద్రం సడలింపులు

ఈ నెల చివరి వారం లేదా జూన్‌ ప్రారంభంలో ట్రయల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రంలోని మారుమూల గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు తరలించేందుకు కేంద్రం నుంచి రాష్ట్రం మరో కీలక సడలింపు పొందింది. కంటి చూపు పరిధి రేఖను దాటి (బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌).. ఆకాశంలో అత్యంత ఎత్తులో డ్రోన్లను ఎగురవేయడానికి వీలుగా.. ‘మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్‌) నిబంధనలు–2021లను సడలిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

డ్రోన్ల వ్యాక్సిన్ల పంపిణీ కోసం అత్యంత ఎత్తులో వాటిని ఎగురవేయడానికి సడలింపులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 9న కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. అయితే, కంటి చూపు మేర(విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌)లో మాత్రమే డ్రోన్లను ఎగరవేయడానికి సడలింపులు ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఏప్రిల్‌ 29న ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో కంటి చూపు పరిధి రేఖ దాటి డ్రోన్లను ఎగురవేయడానికి ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి లభించింది. 

వ్యాక్సిన్ల పంపిణీ అవసరాల కోసం డ్రోన్లను ఎగురవేయడానికి అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతుల(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌/ఎస్‌ఓపీ)కు సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) నుంచి ఆమోదం పొందాలని పౌర విమానయాన శాఖ సూచిం చింది. డీజీసీఏ నుంచి ఎస్‌ఓపీకి ఆమోదం లభించిన నాటి నుంచి ఏడాది పాటు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. తాజా అనుమతులతో సుదూర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేరవేర్చడానికి దోహదపడనుంది. రాష్ట్రం ఈ సడలింపులు కోరినా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం ఈ ప్రయోజనం పొందనున్నాయి.  

వికారాబాద్‌లో ట్రయల్స్‌... 
వికారాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ నెల 4వ వారంలో లేదా జూన్‌ ప్రారంభంలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను జిల్లాలోని మారు మూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించేందు కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ట్రయ ల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. 24 రోజుల పాటు డ్రోన్లతో ట్రయల్స్‌ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది.   

ఇక్కడ చదవండి:
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తండాలో నో కరోనా.. ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top