చిట్టి గుండెకు గట్టి అండ

Cardiac Surgeries For A Newborn In Nims Hospital - Sakshi

లక్డీకాపూల్‌: అంతర్జాతీయ ప్రమాణాలతో నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న నిజామ్స్‌ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌) ఇక నుంచి నవజాత శిశువులకు సైతం హృద్రోగ శస్త్రచికిత్సలు చేయనుంది. పుట్టుకతో ఏర్పడే గుండె సమస్యలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. జూబ్లీహిల్స్‌ రోటరీ క్లబ్, సువెన్‌ ఫార్మాసూటికల్స్‌ సహకారంతో రూ. 5 కోట్లతో నిమ్స్‌లో నూతనంగా నవజాత హృదయ సంబంధ శస్త్రచికిత్సల విభాగం (పీడియాట్రిక్‌ కార్డియాలజీ సర్జరీ యూనిట్‌) ఏర్పాటైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు. 

50 పడకలు.. ఆధునిక సదుపాయాలు 
50 పడకలతో కూడిన పీడియాట్రిక్‌ కార్డియాలజీ సర్జరీ యూనిట్‌ విభాగంలో 6 పడకల అత్యాధునిక మాడ్యులర్‌ కార్డియోథొరాసిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ) కూడా ఉంది. నవజాత శిశువుల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్‌–1 ఎయిర్‌ కండిషన్డ్‌ ఐసొలేషన్‌ వార్డును సైతం నిమ్స్‌ సమకూర్చుకుంది. అతిసూక్ష్మమైన వైరస్, బ్యాక్టీరియాలను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉండటం ఈ వార్డు ప్రత్యేకత.

అంతేకాకుండా నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పీడియాట్రిక్, నియోనాటల్‌ సామర్థ్యాలను కూడా నిమ్స్‌ అందుబాటులోకి తెచ్చింది. శస్త్ర చికిత్సల సమయంలో శరీరంలో చోటుచేసుకొనే మార్పులను పసిగట్టి వైద్యులను ముందే హెచ్చరించే అధునాతన కార్డియాక్‌ అవుట్‌పుట్‌ మానిటర్‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్‌ ఆక్సైడ్‌ సరఫరా యంత్రాన్ని సమకూర్చారు. రూ.40 లక్షలతో హార్ట్‌ లంగ్‌ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫస్ట్‌..
నిమ్స్‌ తరహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. నవజాత శిశువుల్లో పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడినప్పుడు శస్త్రచికిత్సలు చేయడానికి ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది. 
– డాక్టర్‌ ఎం. అమరేష్‌రావు, నిమ్స్‌ సీటీ సర్జన్‌   

(చదవండి:

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top