
రాష్ట్రంలో ఇప్పటికీ సాధారణ వర్షపాతమే
వారం రోజుల వర్షానికి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తాజా వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ప్రస్తుత గణాంకాలు సాధారణ స్థితిలో ఉన్నా, మరిన్ని వర్షాలు కురవాల్సిన అవసరముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి సీజన్ వర్షపాత గణాంకాలు పరిశీలిస్తే... జూలై 27వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 33.40 సెంటీమీటర్లు కాగా, నమోదైన వర్షపాతం 33.68 సెంటీమీటర్లు. నెలాఖరు నాటికి 35.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. రెండ్రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా, రేపట్నుంచి వర్షాలు మోస్తరుగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అక్కడ ఇంకా లోటే...
సీజన్ ప్రారంభం నుంచి దాదాపు ఆరువారాల వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో సగటు వర్షపాతం తీవ్ర లోటులో ఉంది. గతవారం రోజులుగా కురిసిన వర్షాలతో వర్షపాత గణాంకాలు అమాంతం పైకిలేచాయి. అయినా, ఐదు జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది.
⇒ మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో 20శాతం పైబడి లోటులో ఉన్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. లోటు వర్షపాతం ఉన్న మండలాల్లోఅత్యధికం ఉత్తర ప్రాంత జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావాన్నే చూపునున్నాయి.
⇒ సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 20శాతం పైబడి వర్షాలు కురవడంతో ఆయా జిల్లాలు అధిక వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి.
⇒ మిగిలిన 23 జిల్లాల్లో వర్షపాత గణాంకాలు సాధారణ స్థితిలో నమోదయ్యాయి.
నేడు..రేపు తేలికపాటి వానలు
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి బికనీర్, కోట, వాయువ్య మధ్యప్రదేశ్ దాని పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది.
వర్షపాత గణాంకాలు ఇలా....
మండలాల సంఖ్య
లోటు 132
సాధారణం 339
అధికం 131
అత్యధికం 132