ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి
టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన నర్సింహులు అనే ధూమ్ ధామ్ కళాకారుడు చెప్పాడు. రెప్ప పాటు సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని మీడియాకు వెల్లడించాడు. తామంతా చూస్తుండగానే పలువురి ప్రాణాలు పోయాయని చెప్పాడు. ''నేను కండెక్టర్ పక్కన నిల్చున్న. దేవుడి దయతో బయటపడ్డాన''ని తెలిపాడు.
ప్రాణాలతో బయటపడిన కండక్టర్
బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడింది. మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బి. మనోహర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు.
స్థానికుల ఆందోళన
బస్సు ప్రమాదం ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజాపూర్ హైవేను వెంటనే పూర్తి చేసి, తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు చేవెళ్ల- వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో ఆలూరు నుంచి వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు.
ఆర్టీసీ ఉన్నతాధికారుల విచారణ
ఆర్టీసీ ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల రీజనల్ మేనేజర్లు, హైదరాబాద్ ఈడీ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆరా తీశారు.
కేసు నమోదు, దర్యాప్తు
బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారని చెప్పారు. గాయపడిన వారిని మహేందర్ రెడ్డి మెడికల్ హాస్పిటల్, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. తాండూర్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో 72 మంది ప్రయాణికులు బయలుదేరారని చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

యమకింకర టిప్పర్
ప్రమాదానికి కారణం అయిన టిప్పర్ నెంబర్ TG 06 T 3879గా అధికారులు గుర్తించారు. ఉదిత్య అనిత పేరుతో మహబూబ్‌నగర్ రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది. పరిమితికి మించి కంకర నింపడంతో పాటు మితిమీరిన వేగం ఘోర ప్రమాదానికి కారణమైందని ప్రాథమిక సమాచారం.


