
ఉత్సవాలకు అమ్మవార్ల ప్రధాన ఆలయాలు ముస్తాబు
దక్షిణ మండలంలో పోలీసుల భారీ బందోబస్తు
చార్మినార్/చాంద్రాయణగుట్ట: నగరంతో పాటు పాతబస్తీలో ఆదివారం జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోనాల జాతర కోసం లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా పాతబస్తీలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. కాగా.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం 6 గంటలకు మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహాభిõÙకం ఉంటుంది. తదనంతరం బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ తెలిపారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరగనుంది.
పట్టు వ్రస్తాలు సమర్పించనున్న మంత్రులు..
బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆలయాల పరిసరాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్, నిఘా వర్గాలు భారీగా మోహరించాయి. దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ మజీద్, ఛత్రినాక ఏసీపీ సి.హెచ్.చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ లు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.