వైద్యరంగానికి కేంద్ర బిందువుగా ఎయిమ్స్‌

Better Service In All TYpes Of Hosipital With Health Digital ID card - Sakshi

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ 

హెల్త్‌ డిజిటల్‌ ఐడీకార్డుతో అన్ని రకాల ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు 

సాక్షి, యాదాద్రి: ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఎయిమ్స్‌ కళాశాలను అభివృద్ధి చేస్తున్నా రని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వ వైద్యరంగానికి బీబీనగర్‌ ఎయిమ్స్‌ కేంద్ర బిందువుగా మారుతోందని అన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటే ప్రధాని లక్ష్యమని.. అందుకే కేంద్ర బడ్జెట్‌లో రూ.2.40 లక్షల కోట్లను వైద్యరంగానికి కేటాయించారని చెప్పా రు.

దత్తాత్రేయ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అకడమిక్‌ సెక్షన్‌ను ప్రారంభించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెల్త్‌ డిజిటల్‌ ఐడీ కార్డు అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి జరుగుతోందన్నారు. భువనగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

ఎయిమ్స్‌లో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రులపై పనిభారం తగ్గించేలా ఎయిమ్స్‌ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎయిమ్స్‌ ద్వారా అందించే వైద్య సేవలను, కోవిడ్‌ సమయంలో నిర్వహించిన సేవలను ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఎయిమ్స్‌ డీన్‌ డాక్టర్‌ రాహుల్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీరజ్, డాక్టర్‌ శ్యామల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, సీనియర్‌ నేతలు గూడూరు నారాయణరెడ్డి, బండ్రు శోభారాణీ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top