
నేడు హైదరాబాద్‌లో కీలక సమావేశం
పాల్గొననున్న బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు, మేధావులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాలు, మేధావుల నుంచి జేఏసీ ఏర్పాటు డిమాండ్ విన్పిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓపై హైకోర్టు స్టే ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు బ్రేక్ పడడం లాంటి పరిణామాలను బీసీలు జీర్ణించుకోలేక పోతున్నారు.
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో చేతికి అందివచ్చిన అవకాశాన్ని. .తాజా పరిణామాలు లాగేసుకున్నట్టు చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ వర్గాలు నిర్ణయించాయి.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
శనివారం రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన బీసీ కుల సంఘాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆదివారం కాచిగూడ లో రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొనను న్నట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచ రణ సమితిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ నెల 14న రాష్ట్ర బంద్‌కు కృష్ణయ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 30 బీసీ అనుబంధ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.