పేలిపోతున్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు
పరిమితికి మించిన వేడి, ఇతర కారణాలతో ప్రమాదాలు
ప్రాథమిక నియమాలు పాటిస్తే 99% సేఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. పర్యావరణహిత ప్రయాణ సాధనాలుగా పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అక్కడక్కడా ఈ ఈవీ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటం తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40ని–45ని డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నప్పుడు ఇవి కాలిపోవడం, కొన్ని సందర్భాల్లో వాహనదారులు గాయపడటం లాంటి ఘటనలు
ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల్లో బ్యాటరీ సమస్యలు, వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.
పరిమితికి మించి వేడెక్కినప్పుడు..
ఈవీలలో సాధారణంగా లిథియం–అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి అత్యధిక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో రసాయనిక మార్పుల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్‌లో వేలాది చిన్న సెల్స్ ఉంటాయి. చార్జింగ్, డిశ్చార్జింగ్ సమయంలో ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఒక సెల్ పరిమితికి మించి వేడెక్కినప్పుడు, ఆ వేడి పక్కన ఉన్న సెల్స్‌కు వేగంగా వ్యాపిస్తుంది. క్షణాల్లో బ్యాటరీ ప్యాక్ పేలిపోయి మంటలు వ్యాపిస్తాయి.
చల్లని వాతావరణం లేకపోవడం..
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక లిథియం–అయాన్ సెల్స్ (ప్రధానంగా నికెల్ మాంగనీస్ కోబాల్ట్) చల్లని వాతావరణానికి అనుకూలంగా రూపొందుతాయి. అయితే భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. అధిక బాహ్య ఉష్ణోగ్రతలకు.. వాహనం నడిపినప్పుడు, ఫాస్ట్ చార్జింగ్ చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే అంతర్గత వేడి తోడై బ్యాటరీ త్వరగా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.
బీఎంఎస్ వైఫల్యం
బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) అనేది బ్యాటరీకి మెదడు లాంటిది. ఇది ప్రతి సెల్ వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తుంది. తక్కువ నాణ్యత గల సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కలిగిన బీఎంఎస్.. సెల్స్ వేడెక్కుతున్నప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంలో విఫలమైతే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకుంటాయి.
మన దేశంలో భద్రతా చర్యలు
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ బ్యాటరీ భద్రతను పటిష్టం చేయడానికి ఏఐఎస్–156, ఏఐఎస్–038 నిబంధనలకు సవరణలు తీసుకువచ్చింది. వాటి ప్రకారం..
⇒ ప్రతి బ్యాటరీ సెల్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిబంధనల ప్రకారం సునిశితంగా పరీక్షించాలి.
⇒ ప్రతి బీఎంఎస్ తప్పనిసరిగా ఓవర్–చార్జ్, ఓవర్–డిశ్చార్జ్, ఓవర్–టెంపరేచర్, ఓవర్ కరెంట్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండాలి.
⇒ ఒక సెల్ కాలిపోయినా, ఆ మంటలు పక్క సెల్‌కు వ్యాపించకుండా ఉండేలా బ్యాటరీ డిజైన్ ఉండాలి. వాహనదారులు సురక్షితంగా బయటపడటానికి కనీసం 5 నిమిషాల సమయం లభించేలా ఉండాలి.
⇒ బ్యాటరీలో అధిక వేడి సంభవించినప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు డిస్‌ప్లేలో హెచ్చరిక, బీప్ సౌండ్ రావాలి.
⇒ బ్యాటరీ ప్యాక్ తప్పనిసరిగా ఐపీ67 రేటింగ్ కలిగి ఉండాలి. దీనివల్ల ధూళి, వరద నీటిలో మునిగినా షార్ట్ సర్క్యూట్ కాదు.
కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎలక్ట్రిక్ వాహనదారులు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం ద్వారా బ్యాటరీ ప్రమాదాలను దాదాపు 99 శాతం నివారించవచ్చు.
⇒ వాహనంతో పాటు కంపెనీ ఇచ్చిన లేదా ధ్రువీకరించిన చార్జర్లనే వాడాలి.
⇒ సుదీర్ఘ ప్రయాణం తర్వాత బ్యాటరీ కనీసం 30–45 నిమిషాలు చల్లబడిన తర్వాతే చార్జింగ్‌కు పెట్టాలి.
⇒ రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేయడం ప్రమాదకరం. 100% చార్జ్ అయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
⇒ ఎండాకాలంలో వాహనాన్ని వీలైనంత వరకు చెట్లు ఇతర నీడ ప్రాంతాల్లో పార్క్ చేయాలి.
⇒ బ్యాటరీ ప్యాక్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోవాలి. ముఖ్యంగా డిటాచబుల్ బ్యాటరీలను ఇంట్లో చార్జ్ చేసేటప్పుడు బెడ్‌రూమ్‌లు లేదా సులభంగా మంటలు అంటుకునే వస్తువుల (ఎల్‌పీజీ సిలిండర్లు) దగ్గర పెట్టకూడదు.
⇒ బ్యాటరీ చార్జ్ అవుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు రసాయనాల వాసన, పొగ వచ్చినా, అసాధారణ శబ్దాలు విని్పస్తున్నా, బ్యాటరీ ప్యాక్ ఉబ్బినట్లు అనిపించినా వాహనాన్ని నిలిపివేసి టెస్టింగ్‌కు తరలించాలి.


