
మర్రి, రావి వృక్షాలపై గబ్బిలాల ఆవాసం
3 వేలకు పైగా గబ్బిలాలు సంచరిస్తున్న వైనం
ఎండకు మృత్యువాత పడకుండా స్ప్రింక్లర్‌ల సాయంతో కాపాడుతున్న గ్రామస్తులు
కేసముద్రం: ఏ గ్రామంలోనైనా ఒకట్రెండు గబ్బిలాలు కనిపిస్తేనే కీడు సోకుతుందని భయాందోళనకు గురవుతుంటారు. కానీ ఈ గ్రామంలో వందల సంఖ్యలో ఆవాసం ఏర్పాటు చేసుకున్న గబ్బిలాలను అక్కడి ప్రజలు పరిరక్షిస్తూ, వాటిపట్ల ప్రేమను చూపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం గబ్బిలాలకు ఆవాసంగా మారింది. గ్రామంలో మొదటి నుంచి శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం పక్కనున్న మర్రి, రావి వృక్షాలపై వందల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. క్రమక్రమంగా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చాయి.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గబ్బిలాలన్నీ శబ్దాలు చేస్తూ, ఊరంతా తిరుగుతూ వచ్చి వృక్షాలపై వాలుతాయి. అదే సమయంలో గ్రామస్తులు తెల్లవారిందనే సంకేతంతో నిద్రలేచేవారని స్థానికులు చెబుతుంటారు. వేసవికాలం వచి్చందంటే వడగాలులకు తట్టుకోలేక ఆలయంలో పక్కనున్న చెట్లపై నుంచి గ్రామసమీపంలోని చెరువువద్ద ఉన్న మర్రి, రావి వృక్షాలపైకి చేరుతాయి. ఎండ తీవ్రత, వడగాలులతో గబ్బిలాలు ఆకుల్లా రాలిపోతున్న దశలో దాత అందించిన స్ప్రింక్లర్‌ల సాయంతో చెట్లపైనున్న గబ్బిలాలకు నీళ్లను చల్లుతూ బతికించుకుంటారు. 3 వేలకు పైగా గబ్బిలాలుండటంతో కోమటిపల్లి గ్రామం గబ్బిలాలకు కేరాఫ్‌గా మారింది.
నా చిన్నతనం నుంచి చూస్తున్నా
మా ఊరిలోని శ్రీలక్ష్మీనారాయణస్వా మి ఆలయం పక్కనున్న చెట్లపై గబ్బిలాలు ఉండటం నా చిన్నతనం నుంచి చూస్తున్నా. గబ్బిలాలంటే అందరూ భయపడతారు. కానీ మా గ్రామంలో వందల సంఖ్యలో ఉన్న గబ్బిలాలను సంరక్షిస్తుంటాం. వేసవికాలం వచి్చందంటే అవి చనిపోకుండా స్ప్రింక్లర్‌లతో నీళ్లు చల్లిస్తూ బతికించుతాం.
– జి.యాదగిరి, గ్రామస్తుడు
మా గ్రామానికి ప్రత్యేకత
మా గ్రామంలో కొన్నేళ్లుగా గబ్బిలాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమక్రమంగా వాటిసంఖ్య పెరుగుతూ వచ్చింది. గబ్బిలాలతో మాకు కీడు సోకుతుందనే భయంలేదు. పైగా వాటిని సంరక్షిస్తూ, మా గ్రామప్రజలు ప్రేమను చాటుతుంటారు. చుట్టుపక్కల ఏ గ్రామంలో గబ్బిలాలు కనిపించవు. మా ఊరిలోనే వందల సంఖ్యలో గబ్బిలాలు సంచరించడం, వృక్షాలపై ఆవాసం ఏర్పరుచుకున్నాయి. అందుకే మా గ్రామం గబ్బిలాలకు ప్రత్యేకతగా నిలుస్తుంది.
– రావుల మల్లేశం, గ్రామస్తుడు