శ‘బాష్‌’ హైదరాబాద్‌.. 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్న జర్మనీ సంస్థ

Bash Company To Hyderabad Employment For Three Thousand People: KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తమ సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ, జర్మనీకి చెందిన ‘బాష్‌’ ప్రకటించింది. దీని ద్వారా హైదరాబాద్‌ కేంద్రంగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కంపెనీ సీనియర్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘బాష్‌’ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందిన తీరును వివరించారు. మొబిలిటీ, ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్, గృహోపకరణాల రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా ‘బాష్‌’కు పేరున్న విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ గుర్తు చేశారు.

వందేళ్ల క్రితం భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించిన బాష్‌.. 25 ఏళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుకూల విధానాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌ నగరంలో ‘బాష్‌’ అడుగుపెట్టడం గొప్ప విషయమని అన్నారు. కాగా, హైదరాబాద్‌లో తమ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి ‘బాష్‌’ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. కేటీఆర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాష్‌ కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందం, సంస్థ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ ఉపాధ్యక్షులు సుందర రామన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top